Sabarimala Bus Accident: శబరిమలలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం, హైదరాబాద్ భక్తులకు తీవ్ర గాయాలు, డ్రైవర్ దుర్మరణం
Published Jan 03, 2025 07:53 AM IST
- Sabarimala Bus Accident: శబరిమలలో ఇరుముడులు సమర్పించుకునేందుకు వెళుతున్న అయ్యప్ప భక్తుల ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళుతున్న ట్రావెల్స్ బస్సు లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన వారిని కొట్టాయం ఆస్పత్రికి తరలించారు.
పంపలో ప్రమాదానికి గురైన తెలంగాణ ట్రావెల్స్ బస్సు
Sabarimala Bus Accident: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న శ్రీరామ్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీ నుంచి గురుస్వామి రాంపాల్ యాదవ్ నేతృత్వంలో 22మంది అయ్యప్ప భక్తుల బృందం శబరిమలకు బయలు దేరింది. వీరు ప్రయాణిస్తున్న పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దిగువకు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఎనిమిది మందికి తీవ్రగా గాయాలు అయ్యాయి. పాతబస్తీ మాదన్నపేటకు చెందిన వారిగా గుర్తించారు. పంపా నదికి 15కిలోమీటర్లకు దూరంలో ఈ ఘటన జరిగింది.
గాయపడిన వారిని కేరళా పోలీసులు కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డులో దిగువకు పల్టీలు కొట్టిన బస్సును భారీ వృక్షాలు అడ్డుగా నిలవడంతో లోయలోకి పల్టీ కొట్టకుండా ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ల సాయంతో తొలగించారు.