తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mbbs Admission 2024 : ఇవాళ్టి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు.. ఆఖరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే

TG MBBS Admission 2024 : ఇవాళ్టి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు.. ఆఖరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే

27 September 2024, 9:41 IST

google News
    • TG MBBS Admission 2024 : తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వివరించారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ

కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ

తెలంగాణలో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. శుక్రవారం నుంచి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని హెల్త్ వర్సిటీ అధికారులు సూచించారు. కన్వీనర్‌ కోటాలో దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడినవారు, పోలీసు అమరవీరుల పిల్లలు, సైనికోద్యోగుల పిల్లలకు.. ఈ కేటగిరీలకు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనార్టీ, నాన్‌ మైనార్టీ వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థుల మెరిట్‌ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సీటు కేటాయించిన విద్యార్థులు రూ.12 వేలు చెల్లించి ఎలాట్‌మెంట్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. కన్వీనర్‌ కోటా సీట్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు రూ.10 వేలు, ప్రైవేటు కాలేజీల్లో రూ.60 వేలు, ఈఎస్‌ఐ కాలేజీలో ఫీజు లక్ష రూపాయలు ఉంది.

మొదటి రౌండ్‌లో కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వని విద్యార్థులకు.. తర్వాతి రౌండ్‌లలో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉండదని కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. మొదటి రౌండ్‌లో సీటు వచ్చిన విద్యార్థులు.. కళాశాలలో చేరకుంటే తర్వాత రౌండ్లలో కౌన్సెలింగ్‌కు అర్హత ఉండదన్నారు. విద్యార్థుల అర్హతకు సంబంధించి హైకోర్టులోని పెండింగ్‌ కేసుల తుది తీర్పునకు లోబడి కేటాయింపులు, అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు.

తెలంగాణలో 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 4 ముస్లిం మైనార్టీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కోసం మొత్తం 16,694 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి తుది మెరిట్‌ జాబితాను హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. వెబ్ ఆప్షన్లు, ఏమైనా సమస్యలు ఉంటే.. 7842136688, 9392685856, 9059672216 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం