TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ లు బదిలీ, రంగారెడ్డి కలెక్టర్ గా నారాయణ రెడ్డి
28 October 2024, 21:41 IST
TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు.
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ లు బదిలీ, రంగారెడ్డి కలెక్టర్ గా నారాయణ రెడ్డి
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్ గా త్రిపాఠి నియమితులయ్యారు. పురపాలక శాఖ సంచాలకులుగా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మకరందు, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్ కె.హనుమంతులు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హనుమంతులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఎస్.హరీశ్, విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.దిలీప్ కుమార్ , ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
తెలంగాణలో బదిలీలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లాల డీఆర్వోలు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా బదిలీలతో రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పుట్టిన రోజు నాడు 70 అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో 70 మంది డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను సీఎస్ బదిలీ చేశారు. రెవెన్యూ సంఘాల పదోన్నతులు, బదిలీల గురించి అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో ఒకేసారి భారీగా బదిలీలు జరిగాయి. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూసేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ శాఖల్లో అధికారులు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు పోస్టింగ్ లు
ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలికి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను సీఎస్ నియమించారు. దీంతో పాటు జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేశారు. వాణి మోహన్ కు జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను సీఎస్ రిలీవ్ చేశారు. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది.