Supreme Court: ప్రొఫెసర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఉర్దూ విశ్వవిద్యాలయం మాజీ వీసీకి సుప్రీంకోర్టు ఆదేశం
17 October 2024, 13:44 IST
Supreme Court: అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఉర్దూ విశ్వవిద్యాలయం మాజీ వీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.అదే యూనివర్శిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌పై వీసీ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుఆదేశాలు జారీ చేసింది.
భారత సుప్రీం కోర్టు
Supreme Court: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మాజీ చాన్స్ లర్ ఫిరోజ్ భక్త్ అహ్మద్ తన తోటి ప్రొఫెసర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మీడియా సెంటర్ ఆఫ్ జర్నలిజం హెచ్ వోడీగా ఉన్న ప్రొఫెసర్ ఎహ్తేషామ్ అహ్మద్ ఖాన్‌పై ఆరోపణలు చేసే ముందు ఆ వ్యాఖ్యల పర్యవసానాల గురించి ఆలోచించి ఉండాల్సిందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తన తప్పును గ్రహించి బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నందున, వారి మధ్య పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌తో పాటు ఇతర చర్యలను ముగించడం ఇరు పక్షాల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
'పిటిషనర్ ప్రతివాదికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని , దానిని దినపత్రిక మొదటి పేజీలో కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి నాలుగు వారాల్లోగా పెద్ద అక్షరాలతో ప్రకటన ఇవ్వాలని అక్టోబర్ 14న ఇచ్చిన ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.
తనపై వచ్చిన ఆరోపణల కారణంగా ఖాన్ కు కలిగిన మానసిక క్షోభకు రూ.లక్ష రుపాయల పరిహారం చెల్లించాలని అహ్మద్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ మొత్తాన్ని నేటి నుంచి నాలుగు వారాల్లోగా ప్రతివాది నెం.2 పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలని పేర్కొంది.
అహ్మద్ తరఫున సీనియర్ న్యాయవాది విభా దత్తా మఖిజా వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ భావోద్వేగంతో ఈ ప్రకటన చేశారని, ప్రొఫెసర్ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం ఆయనకు లేదని వాదించారు.
ఖాన్ తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపిస్తూ, పర్యవసానాలపై పూర్తి అవగాహన ఉన్న పిటిషనర్ ఇలాంటి ఆరోపణలు చేశారని, ఎలాంటి క్షమాభిక్షకు అర్హుడు కాదన్నారు.
మాజీ వీసీ అహ్మద్ గతంలో మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ ఎహ్తెషామ్ ఖాన్ ను లైంగిక వేటగాడిగా అభివర్ణించారు. ఈ ఆరోపణలపై ప్రొఫెసర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజేంద్రనగర్ కోర్టులో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది.
2023 ఏప్రిల్ 24న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తనపై చర్యలను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లైంగిక వేధింపుల కేసులో ఖాన్ ఆరోపణల నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా అదే పదాలను మాజీ వీసీ అహ్మద్ ఉపయోగించారని కోర్టు గుర్తించింది.