తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Hc On Ias Petitions : ఐఏఎస్‌లకు దక్కని ఊరట..! పిటిషన్లు డిస్మిస్‌, ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు

TG HC On IAS Petitions : ఐఏఎస్‌లకు దక్కని ఊరట..! పిటిషన్లు డిస్మిస్‌, ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు

16 October 2024, 16:35 IST

google News
    • తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఏపీలో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.
ఏపీకి కేటాయించిన ఐఏఎస్ లకు చుక్కెదురు..!
ఏపీకి కేటాయించిన ఐఏఎస్ లకు చుక్కెదురు..!

ఏపీకి కేటాయించిన ఐఏఎస్ లకు చుక్కెదురు..!

తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పలువురు ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. క్యాట్ (Central Administrative Tribunal) ఉత్తర్వులపై ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌, వాకాటి కరుణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్లపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించరాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే… దీనికి అంతం ఉండదని, క్యాట్ తీర్పు ప్రకారం అధికారులు తమకు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

హైకోర్టు ఆశ్రయించటం కంటే ముందు ఐఏఎస్ అధికారులు… క్యాట్ ను ఆశ్రయించారు. ఏపీ తెలంగాణ క్యాడర్ అధికారులు డీఓపీటీ ఉతర్వులను పాటించాల్సిందేననంటూ ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి క్యాట్ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16లోగా చేరాల్సిందేనని హైదరాబాద్లోని కేంద్ర పరిపా లనా ట్రైబ్యునల్(క్యాట్) బెంచ్ స్పష్టం చేసింది.

డీఓపీటీ గత వారం ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి క్యాట్‌ నిరాకరించింది. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తు న్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపుపై అధికారుల వ్యక్తి గత అభ్యర్ధనలను పరిశీలించి.. నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు గత జనవరిలో ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఆలిండియా సర్వీసు అధికారుల విభజన, రాష్ట్రాల కేటాయింపులకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు కొంత మందికి ఇబ్బంది కలిగించి ఉంటాయని అయితే సర్దుబాటు తప్పదని క్యాట్ స్పష్టం చేసింది.పిటిషన్లపై విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగులు అవసరమైతే దేశ సరిహద్దుల్లో పనిచేయడానికైనా సిద్ధంగా ఉండాలని, ఇంట్లో నుంచి పనిచేయడం కుదరదని క్యాట్ అసహనం వ్యక్తం చేసింది. విజయవాడలో వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజ లకు సేవలందించాలని ఎందుకు అనుకోవడం లేదని తెలంగాణలో ఉన్న అధికారుల్ని ప్రశ్నించింది.

క్యాట్ తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్ర పాలి బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారించిన ధర్మాసనం… లంచ్ మోషన్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చింది.

 

తదుపరి వ్యాసం