TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ, స్మితా సబర్వాల్ కు కీలక బాధ్యతలు
11 November 2024, 22:24 IST
TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్మితా సబర్వాల్ ను పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా నియమించారు.
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ, స్మితా సబర్వాల్ కు కీలక బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సీఎస్ శాంతి కుమారి బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ బదిలీ చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్ ను నియమించారు. ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఇలంబర్తి నియమించారు. ట్రాన్స్ కో సీఎండీగా డి. కృష్ణ భాస్కర్ నియమించారు. ఆయనకు డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా సృజన నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్. కృష్ణ ఆదిత్య, మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్ బదిలీ అయ్యారు. రవాణాశాఖ కమిషనర్‌గా కె. సురేంద్ర మోహన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్ నియమితులయ్యారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా శివశంకర్, జీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, లేబర్ కమిషనర్ గా సంజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ గా చిట్టెం లక్ష్మీ బదిలీ అయ్యారు.
టీజీపీఎస్సీ ఛైర్మన్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. టీజీపీఎస్సీకి ప్రస్తుతం మహేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ నూతన చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.