Gruha Lakshmi Scheme: 4 లక్షల మందికి 'గృహలక్ష్మి' .. నిబంధనలు ఎలా ఉండనున్నాయి..?
10 March 2023, 8:25 IST
- new housing scheme in telangana: సొంత జాగలో ఇల్లు కట్టుకునేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త పథకాన్ని ప్రకటించింది. 4 లక్షల మందికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అయితే రేపోమాపో నిబంధనలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
తెలంగాణలో గృహలక్ష్మి పథకం
3 lakhs for the construction of house: అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడటంతో కీలక హామీలపై ఫోకస్ పెంచే పనిలో పడింది బీఆర్ఎస్ సర్కార్. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై చాలా మంది బోలేడు ఆశలు పెట్టుకున్నప్పటికీ... అలా జరగలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ అంచనాలు తప్పినట్లు అయింది. ఈ క్రమంలో సొంత జాగ ఉన్న వారికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గతడాదే ఈ అంశంపై సీఎం కేసీఆర్ కూడా ప్రకటన చేశారు. పలువురు మంత్రులు కూడా చాలాసార్లు ఈ స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో... ఈ స్కీమ్ కు ఆమోదముద్ర పడింది. ఓ పేరును కూడా ఖరారు చేసింది ప్రభుత్వం.
గృహలక్ష్మి పథకం... 3 లక్షల సాయం...
సొంత జాగాలున్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఫలితంగా నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో నాలుగు లక్షల మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు ఇస్తారు. వీటితో పాటు 43 వేల ఇళ్లు రాష్ట్ర కోటాలో ఉంటాయి. రూ. 12 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లను ఆ ఇంట్లోని గృహిణి పేరిటే మంజూరు చేస్తారు.
నిబంధనలేంటి..?
అయితే ఈ స్కీమ్ కు ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు ఈ స్కీమ్ కు అర్హులు అవుతారా..? ఏ ఏ అంశాలను ప్రతిపాదికన తీసుకుంటారు..? ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా ఎన్ని గజాల స్థలం ఉండాలి..? భూమి మగవారి పేరుపై ఉన్నప్పటికీ.. ఆ ఇంట్లోని మహిళని లబ్ధిదారుగా గుర్తిస్తారా..? తెల్లరేషన్ కార్డు తప్పనిసరి చేస్తారా..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో చాలా మంది పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అవి వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ఎలాంటి ఆధారం లేని వారికి మాత్రమే ఆ ఇళ్లను కేటాయిస్తున్నారు. అయితే సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనే వారికి మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు. గతంలో ఇందిరమళ్ల ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేది. కానీ ప్రస్తుతం ఆ స్కీమ్ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్... గృహ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. 4 లక్షల మందికి 3 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ పథకంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవోలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక నిబంధనలు కూడా సరళంగానే ఉండనున్నట్లు ఇప్పటికే మంత్రి హరీశ్ రావ్ ప్రకటించారు.