T-Hub 2.0 at Hyd: స్టార్టప్ లకు మరింత ఊతం.. 28 న టీ - హబ్ 2.0 ప్రారంభం
26 June 2022, 12:40 IST
- T -hub 2.0 at hyderabad: టీ హబ్-2.0 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుంది.
టీ హబ్ 2.0 భవనం
T-Hub hyderabad: ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభం కానుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. టీ హబ్ 2.0 ఫెసిలిటీ సెంటర్.. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన ఓ సూక్తిని తన ట్వీట్ లో ప్రస్తావించారు.
స్టార్టప్ లకు ప్రోత్సాహాం....
టీ హబ్-2ను తెలంగాణ సర్కార్ అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన విషయం తెలిసిందే. అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనుంది. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టెక్నాలజీ హబ్ (టీ హబ్)ను ఏర్పాటు చేశారు.పలు కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది.
2 వేలకుపైగా స్టార్టప్ లకు....
తాజాగా ప్రారంభిస్తున్న టీ హబ్-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించినుంది. ఫలితంగా మరిన్ని నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ వేదికయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత... స్టార్టప్ లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు పొందింది. ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (Parliament Standing Committee) సైతం రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్‌ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేసింది.