తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Liberation Movement: బైరాన్‌పల్లి పోరాటం… నెత్తుటి చరిత్రకు 74 ఏళ్లు

Telangana Liberation Movement: బైరాన్‌పల్లి పోరాటం… నెత్తుటి చరిత్రకు 74 ఏళ్లు

15 September 2022, 15:24 IST

google News
    • Veera Bairanpally Revolt: భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. తెల్లదొరలు దేశాన్ని వదిలి సంవత్సరం గడుస్తున్నా.. నిజాం ప్రాంతంలో స్వేచ్ఛకు తావు లేదు. నిజాం నిరంకుశత్వం పెరిగింది. రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బైరాన్​పల్లి కూడా ఇటువంటిదే.
బైరాన్‌పల్లి నరమేధానికి 74 ఏళ్లు
బైరాన్‌పల్లి నరమేధానికి 74 ఏళ్లు (facebook)

బైరాన్‌పల్లి నరమేధానికి 74 ఏళ్లు

Veera Bairanpally Revolt: బైరాన్ పల్లి... రజాకార్ల ఆగడాలకు వ్యతికేరంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డ..!అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 126 మంది యోధులు నేలకొరిగిన కర్మభూమి..! జలియన్ వాలాబాగ్‌ తరహాలో నరమేధం జరిగిన ప్రాంతంగా చరిత్రలోకి ఎక్కింది. ఈ నెత్తుటి ఘటనకు 74 ఏళ్లు పూర్తికావొస్తుంది. హైదరాబాద్ సంస్థానం... భారతదేశంలో విలీనానికి(సెప్టెంబర్ 17) 74 పూర్తి కావొస్తున్న నేపథ్యంలో బైరాన్ పల్లి పోరాటచరిత్ర తెలుసుకుందాం.

దేశం స్వాంతంత్య్రం పొందింది. నిజాం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్​లో కలపడానికి నిరాకరించాడు. తనని స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని పాలన కొనసాగించాడు. ఓవైపు దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న సందర్భంలో ఇక్కడి ప్రజల్లో స్వేచ్ఛాకాంక్ష పెరగిపోయింది. ఇదే సమయంలో మరింత నిరంకుశంగా వ్యవహరించాడు నాటి నిజాం రాజు. దీనికి తోడు నిజాం సైన్నికాధికారి కాశీం రజ్వి వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు పెచ్చిమీరి పోయాయి. ప్రజల ఆస్తులతో పాటు మానప్రాణాలను దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లోకి రాజకారులు వస్తున్నారంటే గ్రామాలన్నీ భయంతో బిక్కుబిక్కుమంటూ తలదాచుకొనేవి.

telangana liberation movement: ఇలాంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యునిస్టు పార్టీ... పల్లెల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసింది. చురకైన యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి వారిని సాయుధులుగా మార్చింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్​పల్లిలోనూ బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్​పల్లి గ్రామస్థులంతా ఐక్యమయ్యారు. శుత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్ నిర్మాణం చేసుకున్నారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఓసారి లింగాపూర్ గ్రామానికి వచ్చిన రజాకార్లపై బైరాన్ పల్లి గ్రామ రక్షక దళం దాడి కూడా చేసింది.

తమపై దాడి చేసిన బైరాన్​పల్లిపై ఓ కన్నేసి ఉంచారు రజకారులు. తీవ్ర కోపంతో ఉన్న వారు ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు. ఓసారి దాడి చేయగా... బైరాన్ పల్లి గ్రామ రక్షక దళం తిప్పికొట్టింది. ఈ ఘటనలో 20 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి దాడి చేసిన రజాకార్లు గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో కాసీం రజ్వీ పర్యవేక్షణలో 3వసారి దాడికి సిద్ధం చేసుకున్నారు. 500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో ఆగస్టు 27వ తేదీ 1948 రోజు తెల్లవారుజామున గ్రామంపై మెరుపుదాడి చేశారు. ఫిరంగులతో దాడి చేశారు. ఈ దాడిలో బూర్జులోని ఓ గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామగ్రి పేలిపోవడంతో పాటు.. దానిపై నుంచి దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు చనిపోయారు. దీంతో గ్రామం రజాకార్ల హస్తగతమైంది. బైరాన్​పల్లిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి ప్రజల రక్తాన్ని ఎరులై పారించారు. 90 మందికి పైగా యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడించారు. వారిపై అత్యాచారాలు చేశారు.

ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్‌ 17 నాటికి హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యాల దాడికి నిజాం సర్కార్ చేతులెత్తిసింది. దీంతో నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు విముక్తి పొందారు. నాటి నుంచి బైరాన్​పల్లి.. వీర బైరాన్​పల్లి అయింది.

నాటి పోరాట పటిమకు సాక్షిగా నిలిచిన గ్రామంలోని బూర్జు శిథిలావస్థకు చేరుకుంది. సంస్మరణ దినం సందర్భంగా నాడు అసువులు బాసిన 118 మంది అమరుల ఆత్మశాంతి కోసం కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

తదుపరి వ్యాసం