South Central Railway : దయచేసి వినండి.. ఇక నుంచి ఆ ట్రైన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావు!
08 November 2024, 16:32 IST
- South Central Railway : హైదరాబాద్ నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నాలుగో స్టేషన్‌గా చర్లపల్లిని అభివృద్ధి చేశారు. త్వరలో ఇక్కడినుంచే పలు రైళ్లను నడపనున్నారు. దీంతో ఆ ట్రైన్స్ సికింద్రాబాద్ వెళ్లవు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక హంగులతో మరో రైల్వే స్టేషన్ చర్లపల్లి అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రాళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తైన నేపథ్యంలో రైల్వే బోర్డు పలు అనుమతులు ఇచ్చింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు అనుమతి వచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సిద్ధం అవుతున్నారు.
ఆ రైళ్లు ఇవే..
షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.
ఈ రైళ్లకు హాల్టింగ్..
విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్
గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లకు చర్లపల్లి హాల్టింగ్ ఇచ్చారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో రద్దీని తగ్గించనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని చెబుతున్నారు.
హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.
చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కాబోతోంది. ఎంఎంటీఎస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకునే అవకాశం ఉండనుంది.