Sunkishala Issue: అత్యుత్సాహమే కొంప ముంచింది, సుంకిశాల పంప్ హౌజ్ మునక ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య ఫలితమే
15 August 2024, 13:48 IST
- Sunkishala Issue: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని అందించేందుకు మొదలైన సుంకిశాల ప్రాజెక్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఈ నెలారంభంలో జరిగిన సంఘటనతో పంప్ హౌజ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇన్టేక్ వెల్ రక్షణ గోడ కూలిపోయిన సంఘటనతో పనులు నిలిచిపోయాయి.
సుంకిశాల సర్జ్‌పూల్‌లో కూలిపోతున్న రిటైనింగ్ వాల్... (ఫైల్)
Sunkishala Issue: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని అందించేందుకు మొదలైన సుంకిశాల ప్రాజెక్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఈ నెలారంభంలో జరిగిన సంఘటనతో పంప్ హౌజ్ మొత్తం నీటితో నిండిపోయింది.
ఇన్టేక్ వెల్ రక్షణ గోడ కూలిపోయిన సంఘటనతో పనులు నిలిచిపోయాయి. సాగర్ రిజర్వాయర్ కనిష్ట మట్టానికి నీరు చేరితే కానీ తిరిగి సొరంగం, ఇతర పనులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 2వ తేదీన రక్షణ గోడ కూలిపోయి సుమారు రూ.20కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను అటు జలమండలి అధికారులు, ఇటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గోప్యంగా ఉంచాయి.
సోషల్ మీడియాలో వచ్చాక కానీ, ఈ సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదు. దీంతో విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంలు విరుచుకు పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో హడావిడిగా తమకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థకు అవసరం లేని ప్రాజెక్టును రూ.2,215 కోట్లతో మొదలు పెట్టిందని కాంగ్రెస్ ప్రతివిమర్శలకు దిగింది. ఈ సంఘటనపై నిజా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి అప్పగించింది.
ఈ రిపోర్టును పరిశీలించాక ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నలుగురిపై వేటు ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ ను ఆ పోస్ట్ నుంచి తప్పిస్తూ బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్టుకే చెందిన సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియ రాజ్, డీజీఎం ప్రశాంతం, మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేసింది.
నిర్మాణ పనులు చేస్తున్న సంస్థకు షో కాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారని అధికార వర్గాల ద్వారా తెలసింది.
ఏం జరిగింది..?
వాస్తవానికి ఇపుడు హైదరాబాద్ కు పుట్టంగండి (ఎ.ఎం.ఆర్.పి) ద్వారా తాగునీరు అందిస్తున్నారు. అయితే, సాగర్ లో 510 అడుగులకు నీటి మట్టం చేరితే పుట్టంగండి నుంచి నీటిని తీసుకోలేక ప్రత్యేక మోటార్ల ద్వారా ఎత్తిపోయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అసలు, ఏంఎంఆర్పీ నుంచి కాకుండా ప్రత్యేకంగా తాగునీటి ప్రాజెక్టును చేపట్టాలని నాటి ప్రభుత్వం సుంకిశాలకు శ్రీకారం చుట్టింది.
ఇక్కడి నుంచే అయితే, నాగార్జున సాగర్ లో 462 అడుగుల నీటిమట్టం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు తీసుకోవచ్చు. ఈ మేరకు రూపుదిద్దుకున్న సుంకిశాల ఇన్టేక్ వెల్ కు మూడు టన్నెళ్ళను ఏర్పాటు చేశారు. రిజర్వాయరు నుంచి నీరు రాకుండా ఈ టన్నెల్లను మట్టితో మూశారు. ఇదే టన్నెళ్లకు సంబంధించి 504 అడుగల వద్ద టన్నెల్ కు గేటు ఏర్పాటు చేశారు. ఈ పనులు చేయడానికి టన్నెల్ లోకి నీరు రాకుండా అడ్డువేసిన మట్టిని తొలగించారు.
అయితే, పనులు జరుగుతున్న గత 29, 30, 31 తేదీల్లోనే సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద విపరీతంగా వచ్చింది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఇంత నిండుగా నీరున్నా అతి విశ్వాసంతో పనులు చేయడం వల్లే అసలు సమస్య ఏర్పడిందని విచారణ కమిటీ గుర్తించింది. ఒక వేళ మట్టిని తొలగించకుండా, అసలు ఇపుడే గేట్ ఏర్పాటు పనులు చేపట్టకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని విచారణ కమిటీ తేల్చింది.
వాస్తవానికి జలమండలి అధికారుల కంటే, నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్ల అత్యుత్సాహం కొంప ముంచిందంటున్నారు. దీనికి తోడు వాటర్ బోర్డ్ అధికారులు సైతం పనులకు అభ్యంతరం చెప్పకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రస్తుతానికి కొందరిపై చర్యలు తీసుకున్నా మరో ఉన్నత స్థాయి విచారణ కూడా చేపట్టనున్నారు.
(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు , ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )