Vemulawada SivaDeeksha: వేములవాడలో శివదీక్షలు ప్రారంభం... శివమాల ధరించిన వందలాది మంది భక్తులు
17 January 2025, 11:09 IST
- Vemulawada SivaDeeksha: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. వందలాది మంది భక్తులు మండల దీక్ష 41 రోజుల శివ దీక్షా స్వీకరించిన శివన్నామ స్మరణలో నిమగ్నమయ్యారు.

వేములవాడలో ఘనంగా శివదీక్షలు ప్రారంభం
Vemulawada SivaDeeksha: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి హడావిడి మొదలైంది. వచ్చే నెల ఫిబ్రవరి 25 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు అంకురార్పణ జరిగింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని శివ భక్తులు శివ మాల ధరించి మండల దీక్ష భూనారు. 41 రోజుల మండల దీక్షతో కఠిన నియమ నిబంధనలు పాటిస్తూ శివన్నామస్మరణలో నిమగ్నమవుతారు.
రాజన్న సన్నిధిలో మాలధారణ...
వేములవాడ రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల అధ్వర్వంలో 300 మంది భక్తులు శివ మాలధారణ ధరించారు. నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివ మాల వేశారు. ప్రతి యేట మహాశివరాత్రి ముందు శివుడి మాలాధారణ చేసి, శివరాత్రి నాడు లింగొధ్బవ సమయంలో మాల విరమణ చేస్తారు.
32 సంవత్సరాల నుండి ప్రతియేటా శివుడి మాల వేసుకోవడం అనవాయితీగా వస్తుంది. మానవుడు భగవత్ దీక్ష కలిగియుంటే అరిష్టాలు తొలిగి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కల్గుతాయని భక్తుల విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమైనది శివ దీక్ష, లయకారుడైనా శివుడిని రూపం ధరిస్తే మోక్షం కల్గుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన మహశివుడిని భక్తులు కొలుస్తారు. శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు, వేములవాడ వరకు విస్తరించాయి.
కఠిన నియమాలు...
శివధీక్ష స్వీకరించిన స్వాములు కఠిన నియామాలు పాటిస్తారు. శివుడిని పూజిస్తు, కఠిక నేలపై నిద్రిస్తారు. ఒక్కపూట భోజనం, పాదరక్షలు లేకుండా నడుస్తారు. చందన వర్ణం వస్ర్తాలను ధరించి, నుదుట విభూతి, కుంకుమ చందనం, మెడలో రుద్రక్షమాల ధరిస్తారు. శివ దీక్షలు మహామండలం 108 రోజలు, మండల దీక్ష 41 రోజులు, అర్థమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు. దీక్ష సమయంలో నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని ఆర్చకులు అంటున్నారు.
ప్రత్యేక దర్శనం...
శివ దీక్ష తీసుకున్న స్వాములకు మహాశివరాత్రి రోజున ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. లింగోద్భవ సమయాన మాలవిరమణ చేసే స్వాములకు శివరాత్రి రోజున రాత్రి 8 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక దర్శనం ఆలయ అధికారులు కల్పిస్తారు. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న శివదీక్ష స్వాములు ప్రతి ఏటా పెరుగుతున్నారు. ప్రస్తుతం వేలాదిమంది దీక్ష శివ దీక్ష తీసుకుంటున్నారు. ఒక్క వేములవాడ పట్టణానికి చెందిన వారే 300 మంది శివ దీక్ష తీసుకున్నారు. ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పదివేల మంది వరకు శివదీక్ష స్వాములు ఉంటారని భావిస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)