Singareni Accident : సింగరేణిని వెంటాడుతున్న ప్రమాదాలు, జీడీకే2 ఇంక్లైన్ లో పై కప్పు కూలి ముగ్గురికి గాయాలు
28 July 2024, 11:28 IST
- Singareni Accident : సింగరేణిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం రీజియన్ లో జీడీకే 2 ఇంక్లైన్ లో పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
సింగరేణిని వెంటాడుతున్న ప్రమాదాలు, జీడీకే2 ఇంక్లైన్ లో పై కప్పు కూలి ముగ్గురికి గాయాలు
Singareni Accident : సింగరేణిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రామగుండం రీజియన్ లో గడిచిన పది రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. తాజాగా రామగుండం రీజియన్ లో ఆర్జీ వన్ జీడీకే2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ గనిలో రూఫ్ ఫాల్ తో ప్రమాదం జరిగింది. పై కప్పు కూలడంతో ముగ్గురు కార్మికులు నోయల్, శంకర్, సంపత్ లకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో త్రీ సీమ్, 30 లెవల్ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా రూప్ కూలినట్లు గాయపడ్డ వారు తెలిపారు.
మొన్న ఓసీపీలో ప్రమాదం
రామగుండం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 లో ఈనెల 17న మట్టిపెళ్ళలు విరిగి పడడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2 లో పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డడంతో నలుగురు కార్మికులు మట్టిలో కూరుక్కుపోయారు. వారిని వెంటనే సింగరేణి రెస్క్యూ టీం బయటకు తీసేలోపే ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ మృతి చెందారు. సమ్మయ్య, VSN రాజులు గాయపడ్డారు. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. అది మరిచిపోక ముందే ఆర్జీ త్రీ ఓసీపీ వన్ లో పేలుడు పదార్థాలు నింపుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుని ఓబీ మట్టి కాంట్రాక్టు కార్మికుడు ఆడెపు శ్రీకాంత్ తీవ్ర గాయాలయ్యాయి. కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
వరుస ప్రమాదాలపై కార్మిక సంఘాలు ఆందోళన
సింగరేణి లో వరుస ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదాలకు అధికారులు బాధ్యత వహించాలని... మైన్ మేనేజర్ ను ఓవర్ మెనేజర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. సరైన అవగాహన లేకుండా యాజమాన్యం కార్మికులతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగుతున్నాయని ఆరోపించారు. ఒక పని చేయాల్సిన కార్మికులతో మరో పని చేయించడం వల్లే ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయని, మరో ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. కార్మికుల సంక్షేమంపై యాజమాన్యంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇష్టారాజ్యంగా విధులు కేటాయించకుండా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన చేపట్టక తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.