TS Govt Scholarship : విద్యార్థులకు అలర్ట్...'స్కాలర్షిప్' దరఖాస్తుల గడువు పెంపు, ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోవచ్చు
02 February 2024, 14:55 IST
- TS ePASS Post-Matric Scholarship : విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు ఛాన్స్ కల్పించింది.
ఉపకార దరఖాస్తుల గడువు పెంపు
TS ePASS Post-Matric Scholarship 2023- 24: విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. జనవరి 31వ తేదీతో గడువు ముగిసినప్పటికీ మరోసారి అవకాశం కల్పించింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా….. మార్చి 31వ తేదీ వరకు విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో కొత్తవాటితో పాటు రెన్యూవల్ కూడా చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 19న ప్రారంభమైంది. జనవరి 31వ తేదీ వరకు గడువు ముగియటంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేదు. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది సర్కార్. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తులు 12.65 లక్షలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. గడువు సమయం ఎక్కువగా ఇచ్చినప్పటికీ… చాలా మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు రాలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. పలు కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పాటు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉపకారవేతనాలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అయితే చాలా మంది విద్యార్థులకు సకాలంలో ఈ సర్టిఫికెట్లు అందకపోవటంతో దరఖాస్తులు చేసుకోలేకపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణాలరీత్యా మరోసారి విద్యార్థులకు అవకాశం కల్పించారు.
- కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ తో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.
- రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ తో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
- మీ దరఖాస్తు స్టేటస్ ను https://telanganaepass.cgg.gov.in/applicationStatus.do లింక్ తో చెక్ చేసుకోవచ్చు.
పది ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు..
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వ పరీక్షల విభాగం. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేయగా... ఎగ్జామ్ ఫీజు గడువు కూడా ముగిసింది. అయితే పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. గడువు పొడిగించే ప్రసక్తి లేదని వెల్లడించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులు చెల్లించిన ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6వ తేదీలోపు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు.
పదో తరగతి ఫీజు చెల్లింపు - ముఖ్య తేదీలు:
పరీక్ష ఫీజుకు తుది గడువు - 05 ఫిబ్రవరి.2024.
వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో ఈ గడువు ఉంది.
రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక మూడు సబ్జెక్టులు, అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110 చెల్లించాలి.
మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 ను కట్టాలి.
వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.