తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Union Minister Kishan Reddy : సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదు - లోక్‌సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy : సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదు - లోక్‌సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Updated Jul 24, 2024 03:51 PM IST

google News
  • సింగరేణి గనులను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన లోక్ సభలో ప్రకటన చేశారు.

లోక్ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

లోక్ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy in Loksabha : తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


ఏ ఒక్క బొగ్గు గనిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రభుత్వం లేదని రెడ్డి లోక్‌సభలో సమాాధానమిచ్చారు.ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

సింగరేణని క్యాలరీస్ ను ప్రైవేటీకరించవద్దని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ గడ్డం లెవనెత్తిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సింగరేణి క్యాలరీస్ లో తెలంగాణ ప్రభుత్వం వాటా 51 శాతం వాటా ఉందని చెప్పారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణి బలోపేతానికి మద్దతు ఇస్తుందన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారంతో పాటు సంస్థలోని ఉద్యోగుల సంక్షేమానికి నిబద్ధతతో ఉంటుందని పునరుద్ఘాటించారు.

సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకంగా ఉంటుందన్నారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించామని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఎలాంటి ఆలోచన కేంద్రానికి లేదన్నారు.

సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్‌బ్లాక్‌లో ఇటీవలనే మరో ముందడుగు పడింది. కీలకమైన అటవీ భూమిని ఒడిశా ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. 

నిజానికి నైనీ కోల్‌బ్లాక్‌ను 2015లోనే సింగరేణి దక్కించుకుంది. ఈ బ్లాక్‌కు  అన్ని రకాల అనుమతులు రావడంతో రానున్న మూడు నెలల్లో ఈ బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి భావిస్తోంది.  ఈ ప్రాజెక్ట్‌ కోసం 783 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించాలని సింగరేణి కోరింది. కానీ ఇటీవలే 643 హెక్టార్ల భూమిని ఒడిశా ప్రభుత్వం.. సింగరేణికి బదలాయించింది. 2015లో సింగరేణికి ఈ బ్లాక్‌ను కేటాయించనప్పటికీ… భూ బదలాయి సమస్యతో అడుగు ముందుకు పడలేదు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది.