తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Murder Case : పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మర్డర్​ కేస్​ - వంద మందికిపైగా విచారణ, ఏడాదైనా వీడని మిస్టరీ..!

Warangal Murder Case : పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మర్డర్​ కేస్​ - వంద మందికిపైగా విచారణ, ఏడాదైనా వీడని మిస్టరీ..!

HT Telugu Desk HT Telugu

14 December 2024, 13:19 IST

google News
    • వరంగల్ నగరంలో చోటుచేసుకున్న ఓ వృద్ధురాలి మర్డర్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఘటన జరిగి ఏడాది కావొస్తున్న నిందితుల జాడ చిక్కలేదు. ఇప్పటి వరకు వంద మందికిపైగా విచారించారు. అయినప్పటికీ ఈ కేసులో ఫలితం శూన్యంగా ఉంది. ఏ చిన్న ఆధారం దొరకకుండా మర్డర్ చేయటంతో కేసును చేధించటం సమస్యగా మారింది.
కన్నె విజయ(68)
కన్నె విజయ(68)

కన్నె విజయ(68)

వరంగల్ నగరంలో హర్రర్ సినిమా తరహాలో జరిగిన ఓ మర్డర్ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఓ వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన దుండగులు, సాక్ష్యాధారాలు దొరక్కకుండా జాగ్రత్త పడగా… కేసును చేధించేందుకు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే వంద మందికిపైగా అనుమానితులను విచారించినా ఫలితం లేకపోవడంతో ఏడాదైనా వృద్ధురాలి మర్డర్ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో స్థానికుల్లో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది.

క్రైమ్ సినిమా తరహాలో హత్య

వరంగల్ ట్రై సిటీలోని కాజీపేట రహమత్ నగర్ కు చెందిన కన్నె విజయ(68) వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండేది. ఆమె భర్త భద్రయ్య అంతకు ఆరు సంవత్సరాల కిందటే చనిపోగా, విజయ తన కొడుకు కన్నె వీరఅశోక్ ఇంట్లో ఉంటూ వడ్డీల వ్యాపారం నడిపిస్తుండేది. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 14న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిన విజయ ఆ తరువాత కనిపించకుండా పోయింది. సాయంత్రమైనా ఇల్లు చేరకపోవడంతో ఆమె కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు రాత్రి 12.30 గంటల వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇంటికి చేరుకున్నారు.

ఈ క్రమంలో అర్ధ రాత్రి 2 గంటల ప్రాంతంలో వారి ఇంటికి కొద్ది దూరంలోని మరో గల్లీలో కుక్కలు విపరీతంగా మొరగడం మొదలు పెట్టాయి. ఒక్కసారిగా కుక్కల శబ్ధం కావడంతో అనుమానం వచ్చిన విజయ కొడుకు వీరఅశోక్, ఇతర కుటుంబ సభ్యులంతా కుక్కల వైపు పరుగులు తీశారు. దీంతో వారికి తమ ఇంటి వైపు ఉన్న ఓ స్ట్రీట్ లైట్ కింద డెడ్ బాడీ కనిపించింది. విజయ మృతదేహం అర్ధనగ్నంగా ఉండగా, ఆమె జాకెట్ కొద్దిదూరంలో ఉన్న డ్రైనేజీ వద్ద రక్తంతో తడిసి ఉంది. విజయ తల వెనుక భాగంతో పాటు కుడి చేతి మధ్య వేలు కూడా పగిలిపోయి ఉన్నాయి. ఆమె ఒంటిపై ఉండాల్సిన రెండు తులాల బంగారం కనిపించకపోవడంతో బంగారం కోసమే ఆమెను హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆధారాలు చిక్కకుండా మర్డర్

విజయను హతమార్చిన దుండగులు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. డిసెంబర్ 14న ఉదయం విజయ ఇంటి ముందు నుంచి బయటకు వెళ్లిపోగా, ఆ దృశ్యాలు ఆ మార్గంలోని ఓ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కానీ ఆమెను హత్య చేసిన దుండగులు ఎలాంటి సీసీ కెమెరాలు లేని, విజయ ఇంటి వెనకవైపు ఉన్న గల్లీ నుంచి వచ్చి డెడ్ బాడీని పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆ కాలనీ వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేగాకుండా విజయను హత్య చేసిన దుండగులు ఆమె ఒంటిపై రక్తపు మరకలు లేకుండా తుడిచేశారు. పోలీస్ డాగ్ స్క్వాడ్ కూడా వాసన పసిగట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే మర్డర్ జరిగిన అనంతరం పోలీస్ శునకాలు ఘటనా స్థలాన్ని పరిశీలించినా ఫలితం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వంద మందిని విచారించినా ఫలితం శూన్యం..!

వడ్డీ వ్యాపారం చేసే విజయ హత్యకు గురి కావడంతో ఆమె వద్ద అప్పు తీసుకున్న వారెవరైనా ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమాలు వ్యక్తమయ్యాయి. అంతేగాకుండా పాత కక్షలు, కుటుంబ పరిస్థితులపై కూడా పోలీసులు ఆరా తీసి, మొత్తంగా ఈ కేసులో వంద మందికిపైగా విచారణ జరిపారు. అయినా అసలు ఆమెను చంపింది ఎవరు.. ఎందుకు చంపారనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు.

నగల కోసం చంపిన వ్యక్తులు మృతదేహాన్ని సీసీ కెమెరాలు లేని మార్గంలో తీసుకు రావడానికి వారికి ఎవరైనా సహకరించారా.. ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారంటే చంపింది ప్రొఫెషనల్సా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంచలనం కలిగించిన పెద్ద పెద్ద కేసులనే రోజుల వ్యవధిలో పరిష్కరించి ఎవర్ విక్టోరియస్ గా పేరుగాంచిన వరంగల్ పోలీసులు విజయ మర్డర్ కేసును సాల్వ్ చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాజీపేట పోలీసులు విజయ మర్డర్ కేసును నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తుండగా, ఒక క్రైమ్ సినిమా తరహాలో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో.. అసలు దోషులుగా ఎవరు తేలుతారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

తదుపరి వ్యాసం