తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mrps Manda Krishna : ఉచిత ప్రయాణం పేద మహిళలకే పరిమితం చేయాలి - రేవంత్ సర్కార్ కు మందకృష్ణ సూచనలు

MRPS Manda Krishna : ఉచిత ప్రయాణం పేద మహిళలకే పరిమితం చేయాలి - రేవంత్ సర్కార్ కు మందకృష్ణ సూచనలు

13 December 2023, 20:40 IST

google News
    • Manda Krishna Madiga On Congress Govt: తెలంగాణలోని కొత్త ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంలో మొదటి చాప్టర్ లో పేర్కొన్నట్లుగా ప్రజాస్వామిక పరిపాలన అందించాలన్నారు. పేద మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరారు.
మందకృష్ణ మాదిగ
మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ

MRPS chief Manda Krishna Madiga: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన,సామాజికన్యాయం అమలు జరగాలన్నారు MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దొరల పాలన పోయి,పటేళ్ళ పాలన వచ్చినట్లు కావద్దని అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలన స్ధానంలో కాంగ్రెస్ పాలన వచ్చిందన్న ఆయన.. అయితే కాంగ్రెస్ పాలన దొరల పాలన పోయి పటేళ్ళ పాలన రావద్దని సూచిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా… రేవంత్ రెడ్డి నాయకత్వములో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

“BRS పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. నియంతృత్వం,అహంకారం, కుటుంబపాలన నుండి విముక్తి కోసమే BRS ను ప్రజలు ఓడించారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు. అందుకే కేసీఆర్ ప్రభుతాన్ని ఓడించారు. BRS ప్రభుత్వానికి ఉన్న అవలక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకోవాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంలో మొదటి చాప్టర్ లో పేర్కొన్నట్లుగా ప్రజాస్వామిక పరిపాలన అందించాలి. నియంతృత్వ లక్షణాలు రాకుండా చూసుకోవాలి. కేసీఆర్ ప్రశ్నించే వారిని శత్రువులుగా చూసి అణచివేయాలని చూసాడు. అందులో భాగంగానే నన్ను, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కోదండరామ్ లను జైలులో పెట్టారు. ఇది నియంతృత్వం,అప్రజాస్వామికం. ప్రజలు ఈ నియంతృత్వ చర్యలు సహించలేకపోయారు. కనుక రేవంత్ రెడ్డి నేతత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే వారిని శత్రువులుగా చూడకూడదు. ప్రజల పక్షాన వస్తున్న ప్రశ్నలను ప్రజాస్వామిక స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం తల్లి తెలంగాణ పుస్తకం 2001 లోనే రాశాను. దొరల పాలన వద్దనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత మంత్రివర్గంలో సామాజిక న్యాయ స్ఫూర్తి కొరవడింది. ప్రస్తుతం నియమించిన మంత్రి వర్గంలో ఏ సామాజిక వర్గానికి రెండు పదవులు ఇవ్వలేదు. కానీ రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురు ఉన్నారు. 93% జనాబా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు తగిన న్యాయం జరగలేదు. మంత్రివర్గ నియామకంలో సామాజిక సమతుల్యత లేదు. ముస్లిం ప్రజలూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ఒకవేళ కాంగ్రెస్ నుండి ముస్లింలు గెలువకపోతే MLC చేసైనా మంత్రి పదవులు ఇవ్వాలి” అని సూచించారు మందకృష్ణ.

ఏడు శాతం లేని అగ్రకులాలకు పెద్ద పీట వేసే 93 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విస్మరించారని అన్నారు మందకృష్ణ. మిగతా మంత్రి పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని కోరారు. “ప్రజాస్వామిక స్పూర్తితో పాలన అందినంత కాలం, సామాజిక న్యాయాన్ని గుర్తించినంత కాలం మా మద్దతు ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మా నుండి ప్రశ్నలు విమర్శలు,నిరసనలు ఉద్యమాలు పోరాటాలు వుంటాయి. కానీ ఆ పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. అది రేవంత్ రెడ్డి గారి మీదనే ఆధారపడి ఉంది. బడ్జెట్ తో సంబందం లేని, ఒక రూపాయి బారం పడని, హామీలను తక్షణమే అమలు చేయాలి. మేనిఫెస్టోలో పేర్కొన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలి.ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచాలి. ఎస్టీ రిజర్వేషన్లు 12%పెంచాలి. అలాగే కామారెడ్డి బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు.అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన ప్రకారం గత ప్రభుత్వ అవసరాల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల నుండి గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి వారికి అప్పగించాలి. రైతు బంధును పేద రైతులకు మాత్రమే వర్తింపజేయాలి. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా వుండాలి. అలాగే మహాలక్ష్మి పథకంలో బాగంగా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అనేది పేద మహిళలకు పరిమితం చేయాలి. దళిత బందు కుడా పేద దళితులకు అందాలి. వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి” అని మందకృష్ణ కోరారు.

తదుపరి వ్యాసం