తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Elections: ఉత్తర తెలంగాణలో జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ... సత్తా చాటేందుకు యత్నిస్తున్న ప్రముఖులు

Mlc Elections: ఉత్తర తెలంగాణలో జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ... సత్తా చాటేందుకు యత్నిస్తున్న ప్రముఖులు

HT Telugu Desk HT Telugu

17 October 2024, 5:54 IST

google News
    • Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తుంది. పోటీకి ఆసక్తి చూపే వారు పోటాపోటీగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
ఉత్తరతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
ఉత్తరతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

ఉత్తరతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. నవంబర్ 6 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 20 లక్షల మంది పట్టభద్రులు ఉన్నట్లు అంచనా. అందులో 50 శాతానికి పైగా ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పోటీకి ఆసక్తి చూపే వారు జోరుగా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు.

ఓటర్ల నమోదుతోనే సత్తా చాటే పనిలో నిమగ్నమయ్యారు. విద్యాసంస్థలు డాక్టర్లు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతను కలిసి మద్దతు కూడగట్టుకుంటూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచేది ఎవరో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఎవరికి వారే తమ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ప్రచారం సాగిస్తున్నారు.

కరీంనగర్ లో డజన్ మంది పోటీ..

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాలతో ముడిపడి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీకి సిద్ధమైన వారిలో ఎక్కువ మంది కరీంనగర్ కు చెందినవారే ఉన్నారు. ఇప్పటికే డజన్ మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖ విద్యావేత్త ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన వెలిచాల రాజేందర్ రావు, బిఆర్ఎస్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిజేపి నాయకులు పి.సుగుణాకర్ రావు, ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖర్ రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ బి.ఎన్.రావు, డాక్టర్ హరికృష్ణ, ప్రసన్న హరికృష్ణ, పోకల నాగయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అందులో నరేందర్ రెడ్డి, రవీందర్ సింగ్, సుగుణాకర్ రావు, శేఖర్ రావు, ప్రసన్న హరికృష్ణ ముమ్మరంగా ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టారు. మార్నింగ్ వాక్ తో పట్టభద్రులను, ఉద్యోగులను, విద్యాసంస్థల ప్రతినిధులను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఓటర్ల నమోదు తో సత్తా చాటేపనిలో నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్ రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రాజేందర్ రావు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని అంటున్నారు. నరేందర్ రెడ్డి 2018 లో కాంగ్రెస్ చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగుతున్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తు ఓటర్ నమోదు తో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.

ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సైతం సిద్ధమై జోరుగా సభ్యత్వ నమోదు తో ప్రచారం సాగిస్తున్నారు. అందుకు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని సభ్యత్వ నమోదుతో సత్తా చాటేందుకు వంద మందితో ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఓటర్ గా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

బిఆర్ఎస్ నుంచి సర్దార్…

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తోపాటు యాదగిరి శేఖర్ రావు, డాక్టర్ బి.ఎన్.రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఆసక్తి చూపుతున్నారు. గులాబీ దళపతి మాజీ సీఎం కేసిఆర్ ఇప్పటికే సర్దార్ రవీందర్ సింగ్ కు అభయం ఇవ్వడంతో జోరుగా సభ్యత్వ నమోదు తో ప్రచారం సాగిస్తున్నారు. వ్యక్తిగత పరిచయాలతో పాటు కార్పొరేటర్ గా, మేయర్ గా న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పట్టభద్రులను వేడుకుంటున్నారు.

బిజేపి నుంచి సుగుణాకర్ రావు…

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నుంచి పోటీ చేసేందుకు కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సుగుణాకర్ రావు సిద్దమై సభ్యత్వ నమోదును ముమ్మరం చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో నాలుగు పార్లమెంటు స్థానాల్లో బిజెపి గెలుపొందడం... ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో పలువురు పార్టీకి ఎమ్మెల్యేలు ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయని భావిస్తూ సుగుణాకర్ రావు అవిశ్రాంతంగా సభ్యత్వం నమోదు సాగిస్తున్నారు. సుగుణాకర్ రావు తో పాటు రాణి రుద్రమ, భోగ శ్రావణి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారు ఎక్కడ సభ్యత్వ నమోదు చేస్తున్న దాఖలాలు లేవు.

ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు ఎక్కువ మందే ఉన్నారు. కానీ ప్రస్తుతం సభ్యత్వ నమోదులో కరీంనగర్ లోనే డజన్ మంది కనిపిస్తుండడంతో రాజకీయంగా ఎన్నికల హీట్ ను పెంచుతుంది.

(రిపోర్టింగ్ కే వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం