HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Coal Block Auction : బొగ్గు గనుల వేలం ప్రారంభం - సింగరేణికి 'శ్రావణపల్లి' దక్కేనా...?

Coal Block Auction : బొగ్గు గనుల వేలం ప్రారంభం - సింగరేణికి 'శ్రావణపల్లి' దక్కేనా...?

21 June 2024, 15:25 IST

    • Coal Block Auction Updates: హైదరాబాద్ వేదికగా బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది.  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి… సింగరేణికి సంబంధించి పలు అంశాలను దృష్టికి తీసుకెళ్లారు.
బొగ్గు గనుల వేలం ప్రారంభం
బొగ్గు గనుల వేలం ప్రారంభం

బొగ్గు గనుల వేలం ప్రారంభం

Coal Block Auction Updates: పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. హైదబాద్ వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలం పాటను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సింగరేణి సీఎండీ కూడా హాజరయ్యారు.

ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలానికి ఉంచింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క… సింగరేణి గనులకుసంబంధించి పలు అంశాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని భట్టి కోరారు. గనులు కేటాయించకపోతే…. భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. . సింగరేణికి వేలంలో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

సింగరేణి సంస్థ కొంగు బంగారం వంటిదన్న భట్టి….130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వేలం పెట్టిన శ్రావణపల్లి గనిని సింగరేణికే ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి వేలంలో రిజర్వేషన్లను కల్పించే విధంగా చొరవ చూపాలని భట్టి కోరారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో మాట్లాడుతామని…ఇందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. అఖిలపక్షంగా వచ్చి సింగరేణి సమస్యలను ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్‌ల పాత లీజు రద్దు చేయాలని… వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందని విమర్శించారు.

కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. ?

ఈ వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ….సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవెనెత్తిన పలు అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒడిశా నైనీ కోల్‌ బ్లాక్‌లో సింగరేణికి లాభం చెందే విధంగా చేస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామన్న ఆయన…. కొత్త కోల్‌మైన్‌ యాక్షన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కేంద్రం అన్యాయం చేయదన్నారు.

తాజాగా జరుగుతున్న పదో వేలంలో మొత్తం 60 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 15, జార్ఖండ్‌ - 6, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ఒక శ్రావణపల్లి మాత్రమే జాబితాలో ఉంది. ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది.

ఈ బ్లాకును దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొనింది. ఈ బ్లాక్ ను సింగరేణికే ఇవ్వాలని భట్టి కోరిన నేపథ్యంలో…. ఈ బ్లాక్ ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజారనీయవద్దని… దక్కపోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇక గనుల వేలంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. గనులను వేలం వేసి… సింగరేణి మూతపడేయాలన్న కుట్ర జరుగుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వేలంలో ప్రైవేటు కంపెనీలు కూడా పాల్గొనవద్దని కోరారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పిన కేటీఆర్…. ఈ నిర్ణయాలను సమీక్షిస్తామని హెచ్చరించారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్