Teegala Krishna Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ గూటికి తీగల కృష్ణారెడ్డి
07 August 2023, 14:02 IST
- Teegala Krishna Reddy: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ లోకి క్యూకట్టారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, తీగల కృష్ణారెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
కాంగ్రెస్ లోకి తీగల
Teegala Krishna Reddy: బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు.
సబితా ఇంద్రారెడ్డితో విభేదాలు
టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తీగల హైదరాబాద్ మేయర్‌గా, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలైయ్యారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాజకీయ పరిస్థితుల బట్టి టీఆర్ఎస్ చేరారు. మళ్లీ 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో తీగల ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ చేరి మంత్రి పదవి పొందారు. తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేశ్వరం జడ్పీటీసీగా గెలుపొంది... రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గా ఎన్నికలయ్యారు. తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇద్దరూ ఒక పార్టీలో ఉండడం, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని తీగల తరచూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ టికెట్‌లని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక పార్టీ మారడమే మేలని భావించిన తీగల... కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
టి.కాంగ్రెస్ లో జోష్
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అప్పటి వరకూ బీజేపీ వైపు చూసిన బీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా.. కాంగ్రెస్ బాటపట్టారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు లాంటి కీలక నేతలు హస్తం పార్టీలో చేరడంతో... ఇతర నేతలూ అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలు, టికెట్ రాదని భావిస్తున్న వారంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. అయితే కొత్త నేతల రాకతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అయితే కొత్త చిక్కులూ వచ్చి పడుతున్నాయి. పార్టీలో కొత్తగా వస్తున్న వాళ్లు టికెట్ హామీ పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ల పరిస్థితి ఏంటని కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాలు టి.కాంగ్రెస్ కు మంచి ఊతం ఇస్తున్నారు.