తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics : ఎందుకు ఈ సన్మానం?.. రేవంత్ రెడ్డి-కిషన్ రెడ్డి భేటీపై కేటీఆర్ సెటైర్లు

Telangana Politics : ఎందుకు ఈ సన్మానం?.. రేవంత్ రెడ్డి-కిషన్ రెడ్డి భేటీపై కేటీఆర్ సెటైర్లు

13 December 2024, 11:19 IST

google News
    • Telangana Politics : రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల భేటీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్.. కిషన్ రెడ్డిని ఎందుకు సన్మానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. శుక్రవారం సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.
కిషన్ రెడ్డిని సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి
కిషన్ రెడ్డిని సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి (@KTRBRS)

కిషన్ రెడ్డిని సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్టు, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపుల గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.

అయితే.. వీరిద్దరి భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. 'ఎందుకు ఈ సన్మానం? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనుపో అని చెప్పినందుకా? ఎందుకు ఈ సన్మానం? అమృత్ స్కాంలో నీ బావమరిదిని కాపాడుతున్నందుకా? ఎందుకు ఈ సన్మానం? పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో వివరాలు బయటకి రాకుండా ఆపి, కేసులు పెట్టకుండా ఆపినందుకా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

రిజనల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌), హైదరాబాద్‌ మెట్రో రెండో దశతో పాటు హైదరాబాద్, వరంగల్‌లలో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలపై కిషన్ రెడ్డితో.. రేవంత్ చర్చించారు. మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

గడ్కరీతో..

తెలంగాణ మణిహారం రీజిన‌ల్ రింగు రోడ్డు ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి స‌మావేశ‌మై రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను అందించి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని వివరించారు. ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.

ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే.. హైద‌రాబాద్-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్- విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు.

తెలంగాణ‌లోని రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాలన్నారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళుతోంద‌ని, ఈ ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌ల నుంచి నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కోరారు.

పర్వత్ మాల ప్రాజెక్ట్‌లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

తదుపరి వ్యాసం