తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే... మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే - కేటీఆర్

KTR Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే... మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే - కేటీఆర్

22 January 2025, 17:15 IST

google News
    • రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని గ్రామసభల సాక్షిగా తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఇక భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనన్న ఆయన.. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ నేతలతో కేటీఆర్
పార్టీ నేతలతో కేటీఆర్

పార్టీ నేతలతో కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామసభలో గ్యారంటీలు ఏవని ప్రజలు గర్జిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

గ్యారెంటీలపై ప్రజలే నిలదీస్తున్నారు - కేటీఆర్

“గ్యారెంటీ స్కీమ్ ల కోసం ప్రజలు గల్లీ గల్లీలో కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని గ్రామసభల సాక్షిగా తేలిపోయింది. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూసి ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో గ్రామ/వార్డు సభలను చూస్తే తెలుస్తోంది.ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామసభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారు” అని కేటీఆర్ చెప్పారు.

గ్రామసభలకు వేసిన టెంట్లను కూడా ప్రజలు కోపంతో పీకేస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. “సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఓడిపోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతో కోల్పోయారు. గ్రామాలు, పట్టణాల్లో కేసీఆర్ హయాంలో జరిగినన్ని పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. కేసీఆర్ హయాంలో ఆ పరిస్థితి మారింది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జరిగింది” అని కేటీఆర్ గుర్తు చేశారు.

భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే…

ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇక భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని… సత్తుపల్లిలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు.మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదామని పిలుపునిచ్చారు.

“ఉమ్మడి ఖమ్మంలో మళ్లీ బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుంది. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది బీఆర్ఎస్ నుంచి గెలిస్తే 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనం. రైతుల సమస్యలపై అధ్యయన కమిటీ వేశాం. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై మరింత గట్టిగా సమిష్టిగా పోరాడదాం. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు” అని కేటీఆర్ వివరించారు.

తదుపరి వ్యాసం