తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Interrogation: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌, కాంగ్రెస్‌ మోసాలపై పోరాటం ఆగదని ప్రకటన

KTR interrogation: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌, కాంగ్రెస్‌ మోసాలపై పోరాటం ఆగదని ప్రకటన

09 January 2025, 10:01 IST

google News
    • KTR interrogation: ఫార్ములా ఈ కార్‌ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఏఏజీ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు   హైకోర్టు అనుమతించింది. 
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్

KTR interrogation ఫార్ములా-ఈ కార్‌ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించక పోవడంతో కేటీఆర్‌ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. దీంతో కేటీఆర్‌ గురువారం విచారణకు హాజరయ్యారు.

ఫార్ములా ఈ కార్‌ కేసులో ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని తీసుకు వెళ్లే అంశంపై బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు న్యాయవాదిని అనుమతించింది. కేటీఆర్‌ తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్‌ రామచందర్‌ రావు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫార్ములా ఈ కార్‌ రేసులో  న్యాయవాదిని ఏసీబీ విచారణకు అనుమతించే విషయంలో హైకోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణ గదిలో కాకుండా… బయట గది వరకే న్యాయవాదికి అనుమతి ఉంటుంది. విచారణ గదిలోకి కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

అరపైసా కూడా అవినీతికి పాల్పడలేదన్న కేటీఆర్‌

తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్‌ సైనికుడిగా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడానికే రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని, అవి ఫలించి దేశంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశాయన్నారు. తనను ఎంత వేధించినా కొట్లాట ఆగదన్నారు.

తొమ్మిదేన్నరేళ్లలో ఎప్పుడూ బామ్మర్దులకు 1137 కోట్ల కాంట్రాక్టులు,కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదని, అలాంటి తెలివితేటలు నాకు లేవన్నాారు. ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లి రూ.50లక్షలతో దొరికిపోలేదన్నారు. అరపైసా అవినీతి కూడా తాను చేయలేదని స్పష్టం చేశారు.

తెలిసి తెలియకుండా బుదరచల్లి సంతోషపడుతున్నారని, తనపై చల్లే బురదతో తమ పార్టీ దృష్టిని మళ్లించలేరన్నారు. విద్యుత్ చార్జీలు, హైడ్రా కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమలు వంటి అంశాల నుంచి దారి మళ్లించి, దృష్టి మళ్లించలేరన్నారు. రేవంత్ ఇచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. న్యాయస్థానాలు, చట్టాల మీద తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మీడియాను మేనేజ్‌ చేసి వార్తలు వేసి సంతోష పడుతున్నారన్నారు.

దూకుడు పెంచిన ఏసీబీ…

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ కు ఈడీతో పాటు ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఓసారి ఏసీబీకి ఆఫీస్ వరకు వెళ్లిన కేటీఆర్… న్యాయవాదిని అనుమతించకపోవటంతో వెనుదిరిగి వచ్చారు. అయితే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 9న హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఏసీబీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్.. గురువారం ఏసీబీ ముందు హాజరయ్యారు. అంతకు ముందు కేటీఆర్‌ నివాసానికి మాజీ మంత్రులు హరీష్‌ రావు, ఇతర నేతలు చేరుకున్నారు. సోదరి కవిత కూడా కేటీఆర్ నివాసానికి వచ్చారు. ఏసీబీ విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ ఫార్ములా ఈ -కారు రేసు కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఇటీవలే ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు.

అక్రమ చెల్లింపులపై ఈడీ కేసు నమోదు...

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన ఫార్ములా ఈ కార్‌ రేస్ నిర్వహణలో భాగంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థకు రూ.45.71 కోట్లను తెలంగాణ మునిసిపల్ శాఖ ద్వారా హెచ్‌ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని హెచ్‌ఎండిఏ ముఖ‌్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఆర్థిక శాఖ అమోదం లేకుండా, హెచ్‌ఎండిఏ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆర్‌బిఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయడంపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

లండన్‌లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ ఖాతాకు బ్రిటన్ కరెన్సీలో నగదు బదిలీ చేశారని, ఇందులో ఆదాయ పన్నుమినహాయించకపోవడం వల్ల ఐటీ శాఖకు రూ.8.06కోట్లను చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని కోరారు. ఈ వ్యవహారంలోనే కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. విదేశాలకు నగదు చెల్లింపుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ లబ్ది ఎవరిిక చేకూరిందో తేలాల్సి ఉంది.

 

తదుపరి వ్యాసం