తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : కొండా వర్సెస్ రేవూరి.. ఆటోలో గీసుకొండ స్టేషన్‌కు వచ్చిన సురేఖ!

Warangal : కొండా వర్సెస్ రేవూరి.. ఆటోలో గీసుకొండ స్టేషన్‌కు వచ్చిన సురేఖ!

14 October 2024, 9:56 IST

google News
    • Warangal : పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫ్లెక్సీల విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లింది. ఆఖరికి వరంగల్ సీపీ జోక్యంతో సద్దుమణిగింది.
ఎస్సై కుర్చీలో కూర్చున్న మంత్రి సురేఖ
ఎస్సై కుర్చీలో కూర్చున్న మంత్రి సురేఖ

ఎస్సై కుర్చీలో కూర్చున్న మంత్రి సురేఖ

మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆటోలో గీసుకొండ స్టేషన్‌కు వచ్చిన సురేఖ.. అరెస్టు చేసిన తమ అనుచరులను బయటకు పంపాలని డిమాండ్‌ చేస్తూ.. పోలీస్ స్టేషన్‌ లో లాకప్‌ వద్ద ఎస్సై కుర్చీలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి అనుచరుల అరెస్టుతో వరంగల్‌- నర్సంపేట రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

ఏం జరిగిందంటే..

పరకాల నియోజకవర్గంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో.. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం జరిగింది. దీంతో కొండా, రేవూరి వర్గాలు బాహాబాహీకి దిగాయి. విజయదశమి పండగ సందర్భంగా కొండా సురేఖ అనుచరులు బండి రాజ్‌కుమార్, ముస్కు సురేష్, చుంచు రాజు ధర్మారంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి ఫొటో లేకపోవడంతో.. ఆయన అనుచరులు పిట్టల అనిల్, దుబాకి సంతోష్‌ కొండా ్నుచరులను ప్రశించారు.

అయితే.. ఎమ్మెల్యే ఫొటోలు ఎందుకు పెట్టాలని వారు బదులివ్వడంతో.. ఆ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో ఆవేశానికి గురైన సురేఖ అనుచరులు పిట్టల అనిల్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనిల్‌ తమ్ముడి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు ఆరుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. వారిని వదిలిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ.. కొండా అనుచకులు ధర్మారంలో వరంగల్- నర్సంపేట రోడ్డుపై ధర్నాకు దిగారు. రెండు గంటలపాటు ఆందోళన కొనసాగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న సురేఖ ధర్నా దగ్గరకు వచ్చారు. తన అనుచరులతో కలిసి ఆటోలో గీసుకొండ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు.

పోలీసులు ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. తమ కార్యకర్తలను విడిచి పెట్టేవరకు వెళ్లబోనని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కుర్చీలోనే కూర్చున్నారు. డీసీపీ, సీఐ, ఎస్సైలను రిలీవ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. వరంగల్‌ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా చేరుకొని మంత్రి సురేఖకు నచ్చజెప్పారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుడు సురేఖ అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఈ వివాదంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. 'ఈ వివాదం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఇది పార్టీ అంతర్గత విషయం కాదు. స్థానికతకు సంబంధించిన అంశం. ఇందులో ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం. సమన్వయం పాటించడం మంచిది' అని ఎమ్మెల్యే రేవూరి వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం