తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar News : పార్టీలకు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్- ఇక్కడి నుంచే ప్రచారాలు షురూ

Karimnagar News : పార్టీలకు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్- ఇక్కడి నుంచే ప్రచారాలు షురూ

HT Telugu Desk HT Telugu

14 October 2023, 22:13 IST

google News
    • Karimnagar News : కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తు్న్న పార్టీలు... తమ ప్రచారాలను ఇక్కడ నుంచే ప్రారభిస్తున్నాయి. 15న బీఆర్ఎస్, 16న బీజేపీ, 18న కాంగ్రెస్ ఇక్కడ నుంచే ప్రచారం మొదలుపెడుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ

Karimnagar News : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర సాధనకు తనవంతుగా నాయకులకు అండగా నిలిచిన కరీంనగర్ జిల్లా వాసులను తెలంగాణ నాయకులు ఎన్నటికీ మరిచిపోరు. అందుకే కరీంనగర్ జిల్లా అన్ని పార్టీలకు సెంటిమెంట్ జిల్లాగా పేరుగాంచింది. జిల్లా ప్రజల ఆదరాభిమానాలను పొందడానికి ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాను మొదటి నుంచి సెంటిమెంట్ గా భావించిన కేసీఆర్15న హుస్నాబాద్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 16న జమ్మికుంట నుంచి, 18వ తేదీన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి ప్రచారాలు ప్రారంభించనున్నారు.

మూడు పార్టీలు కరీంనగర్ నుంచే ప్రచారాలు

అయినను పోయి రావలే హస్తినకు...అన్న పదాన్ని మరపింపచేస్తున్నారు కరీంనగర్ వాసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే సెంటిమెంట్ గా భావించి దిల్లీ నాయకులు కరీంనగర్ గల్లీ గల్లీలో తిరగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీలు కరీంనగర్ జిల్లా నుంచే తమతమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఓటరు నాడిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ముక్కోణపు పోటీ ఉండబోతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల ప్రచారాలు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు.

హుస్నాబాద్ నుంచి కేసీఆర్

ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం కాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించి మూడోసారి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఈ నెల 15న ఎన్నికల ప్రచార తొలి బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. బహిరంగసభకు జనసమీకరణ భారీగా ఉండాలనే నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు పూర్తి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. 15న ఎన్నికల శ్రీకారం చుట్టిన తర్వాత 16వ తేదీ నుంచి అభ్యర్థులు అన్ని చోట్లా ప్రచారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

కొండగట్టు నుంచి కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ ను మళ్లీ హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే సీనియర్ నాయకులతో ఏఐసీసీ పెద్దలు చర్చలు జరుపుతూ జిల్లాలోని రాజకీయ సమీకరణలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆశయంతో ముందుకు సాగుతోంది. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీంలతో పాటు స్థానిక మహిళా, యువతను ప్రభావితం చేసే విధంగా పలు హామీలు గుప్పించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేకపూజలు చేసి అనంతరం ప్రచార రథాలను ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభించనున్నారు.

బీజేపీ నుంచి రాజ్ నాథ్ సింగ్

కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ హుజురాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించి అక్కడే ఎన్నికల శంఖారావం పూరించనున్నారని సమాచారం. ఈ క్రమంలో ఈనెల 16న హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. కేసీఆర్ సభకు దీటుగా ఈ సభను విజయవంతం చేయడానికి ఈటల రాజేందర్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ ను గరంగరం చేస్తూ దిల్లీ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న సభల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు ఆయా పార్టీల నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రిపోర్టింగ్: గోపి కృష్ణ, కరీంనగర్

తదుపరి వ్యాసం