Kaushik Reddy Vs Sanjay Kumar : కరీంనగర్ కలెక్టరేట్ లో రసాభాస-ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య తోపులాట
12 January 2025, 17:30 IST
Kaushik Reddy Vs Sanjay Kumar : కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన మంత్రుల సమీక్ష రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఇరువురూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ లో రసాభాస-ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య తోపులాట
Kaushik Reddy Vs Sanjay Kumar : కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన మంత్రుల సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టేజ్ పై ఒకరినొకరు తోసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకుని దుర్భాషలాడారు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవు అని సంజయ్ కుమార్ ను నిలదీశారు. నేను కాంగ్రెస్ అంటూ సంజయ్ సమాధానం ఇచ్చారు. కౌశిక్ రెడ్డి మీదకు దూసుకురావడంతో ఇద్దరు తోపులాటకు దిగారు. స్టేజ్ పై ఉన్న నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
దమ్ముంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని సవాల్
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి.. నువ్వు ఏ పార్టీ, దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సంజయ్ వైపు దూసుకెళ్లారు. ఇద్దరు చేయి చేసుకునే దాక పరిస్థితి వెళ్లింది. పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారు. కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంజయ్ కుమార్...కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.
అధికారులతో సహా ఎవ్వరినీ వదిలేది లేదు - పాడి కౌశిక్ రెడ్డి
బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అమ్ముడుపోయారని మండిపడ్డారు. సంజయ్ కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని విమర్శించారు. సంజయ్ కుమార్ కు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌తో గెలవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ బీఫామ్‌తో గెలిచి సంజయ్ సిగ్గులేకుండా కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని... అప్పుడు అధికారులతో పాటు ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.