తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jeevanreddy Issue: జీవన్ రెడ్డి ఆవేదనకు అర్థం ఉంది... ప్రభుత్వం,కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పరిష్కరిస్తుందన్న శ్రీధర్‌బాబు

Jeevanreddy Issue: జీవన్ రెడ్డి ఆవేదనకు అర్థం ఉంది... ప్రభుత్వం,కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పరిష్కరిస్తుందన్న శ్రీధర్‌బాబు

HT Telugu Desk HT Telugu

29 October 2024, 7:10 IST

google News
  • Jeevanreddy Issue: పార్టీ ఫిరాయింపులపై తీవ్ర ఆవేదనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. జీవన్ రెడ్డి ఆవేదనకు కారణాలు ఉన్నాయని తెలిపారు.‌ పరిష్కరించేందుకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

జీవన్‌ రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు సంఘీభావం
జీవన్‌ రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు సంఘీభావం

జీవన్‌ రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు సంఘీభావం

Jeevanreddy Issue: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరాలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం, పార్టీ పెద్దలు ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిస్తూ, ఫిరాయింపుల వల్లే పార్టీ ముఖ్య అనుచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టానానికి మూడు పేజీల లేఖ రాశారు.

జీవన్ రెడ్డి ఆవేదనకు క్రమంగా మద్దతు పెరుగుతుంది. మొన్న జగ్గారెడ్డి, నిన్న మధుయాష్కి జీవన్ రెడ్డి ఆవేదనను సమర్థిస్తూ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించారు. తాజాగా జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్ బాబు సైతం సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదనకు కారణాలు ఉన్నాయని తెలిపారు. పార్టీ పెద్దలు ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైందని స్పష్టం చేశారు. ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

గంగారెడ్డి హత్యపై విచారణ…

ఇటీవల హత్యకు గురైన జాబితాపూర్ మాజీ ఎంపీటీసి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు గంగారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. గంగారెడ్డి కుటుంబాన్ని ఓదార్చి, హత్యకు కారణాలేంటి అనే అంశాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోందని తెలిపారు.

హత్య వెనుక రాజకీయ కారణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డీజీపీ, ఎస్పీలతో మాట్లాడారని, ఎలాంటి సందేహాలకు తావు లేకుండా విచారణ జరగాలని తాను కోరానని తెలిపారు. ఎందుకు హత్య చేశారో అనేది ఇప్పటికి తెలియడం లేదని మృతుడి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పోలీసు యంత్రాంగం పై పలు అనుమానాలు కూడా ప్రస్తావించారని వాటన్నింటిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.

కుటుంబానికి అండగా ఉంటాం …

గంగారెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆవేదనకు ఆందోళనకు గురి చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గోడలకు నీరు పట్టేందుకు వెళ్లిన గంగారెడ్డి హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. గంగారెడ్డి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనో వేదనకు గురైయ్యారని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పె నాయకుడు జీవన్ రెడ్డి మనస్థాపం చెండదం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, పార్టీ పక్షాన, ప్రభుత్వం తరఫున బాధితుని కుటుంబానికి అండగా ఉంటాం మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం