తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon Mla: 'మత్తడి భూమిని కబ్జా చేశారు.. మా నాన్న ఇలా చేయాల్సింది కాదు' - Mla ముత్తిరెడ్డి కుమార్తె కీలక నిర్ణయం

Jangaon MLA: 'మత్తడి భూమిని కబ్జా చేశారు.. మా నాన్న ఇలా చేయాల్సింది కాదు' - MLA ముత్తిరెడ్డి కుమార్తె కీలక నిర్ణయం

25 June 2023, 13:06 IST

google News
    • Jangaon MLA Land Issue: జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కబ్జా చేసిన భూమిని చేర్యాల్ మున్సిపాలిటికీ అప్పగిస్తున్నట్లు ఆయన కుమార్తె ప్రకటించారు. ఓ నోటీసు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 
క్షమించండి - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి
క్షమించండి - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి

క్షమించండి - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి

Jangaon MLA daughter Tuljha Bhavani Reddy: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె మరోసారి ఫైర్ అయ్యారు. భూమిని కబ్జా చేయటం సరికాదన్న ఆమె.... ఆ భూమిని తిరిగి చేర్యాల్ మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ నోటీసు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. ఈ భూమి తనకు తెలియకుండానే తన తండ్రి ముత్తిరెడ్డి.... అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని రెడ్డి ఆరోపణలు చేశారు.

భూమిని తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించిన బోర్డు

"ఇక్కడ తప్పు జరిగింది. మత్తడి భూమిని నాపై రిజిస్ట్రేషన్ జరిగింది. తప్పుజరిగింది. జనగామ ప్రజలను క్షమించమని అడుగుతున్నాను. ఆ భూమిని చేర్యాల్ మున్సిపాలిటికీ రాసి ఇస్తాను. కోర్టు ద్వారా అందజేస్తాను. మా నాన్న ఇలాంటి పని చేయకూడదు. 70 ఏళ్ల వయసు ఉన్న ఆయన... రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని చెప్పే ఆయన....ఇలాంటి పనులు చేయటం సరికాదు" అని తుల్జాభవాని రెడ్డి వ్యాఖ్యానించారు.

Mla Muthireddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కుమార్తె మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందటే…. కుమార్తె తుల్జా భవాని రెడ్డి తన సంతకాన్ని ఫోర్జరీ చేశావని తండ్రి ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీశారు. ఇప్పటికే ఓ కేసు పెట్టాను, ఇంకో కేసు కూడా పెడుతున్నానని తండ్రి ముత్తిరెడ్డిని సూటిగా హెచ్చరించారు. తనకు ఇష్టం లేకపోయినా చేర్యాలలో భూమి కొన్నారని, ఆ డాక్యుమెంట్లలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి భూ వివాదంలో ఇరికించారని భవాని రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే భూములకు సంబంధించి తన తండ్రిని ఆమె ప్రశ్నించడం కలకలం రేపింది. తన కూతురుకు తెలివిగా సమాధానం చెప్పి పంపించేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.

ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి... తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారన్నారు. తన మనోస్థైర్యం దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. తన కుమార్తెకు తన సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తానని ముత్తిరెడ్డి అన్నారు. నా కూతురు అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని ఆడిస్తున్న డ్రామా ఇందతా అని ఎమ్మెల్యే వ్యాఖానించిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలపై ముత్తిరెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి….!

తదుపరి వ్యాసం