తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Fluorid: ఫ్లోరైడ్ భూతం నల్గొండపై మళ్లీ పంజా విసురుతోందా..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాల్లో ప్రమాద ఘంటికలు

Nalgonda fluorid: ఫ్లోరైడ్ భూతం నల్గొండపై మళ్లీ పంజా విసురుతోందా..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాల్లో ప్రమాద ఘంటికలు

HT Telugu Desk HT Telugu

25 October 2024, 15:43 IST

google News
    • Nalgonda fluoride: ఫ్లోరైడ్ విముక్త రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత మళ్లీ నల్గొండపై  ఫ్లోరైడ్ బూతం పడగ విప్పుతోంది. రెండేళ్ల కిందట . ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్ గా  భారత పార్లమెంట్ ప్రకటించింది. తాజాగా నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిలో ఫ్లోరైడ్ ఉందంటుని  నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
నల్గొండలో మళ్లీ పడగ విప్పనున్న ఫ్లోరైడ్ బూతం
నల్గొండలో మళ్లీ పడగ విప్పనున్న ఫ్లోరైడ్ బూతం

నల్గొండలో మళ్లీ పడగ విప్పనున్న ఫ్లోరైడ్ బూతం

Nalgonda fluoride: ఉమ్మడి నల్గొండ జిల్లా పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎపుడో ఎక్కింది. ఈ రికార్డు ఏడు దశాబ్దాల కిందటే నమోదయ్యింది. అయితే, అది ఓ సానుకూల అంశంలో కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన ప్రమాణాల కంటే ఎక్కువగా నీటిలో ఫ్లోరైడ్ శాతం ఉండడంతో ఈ రికార్డ్ నల్గొండ పేరున రికార్డయ్యింది.

మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల పరిధిలోని బట్లపల్లి అనే గ్రామంలో భూగర్భ జలాల్లో 10 పిపిఎం (పార్ట్ పర్ మిలియన్ ) ఎక్కువే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించి ఆ గ్రామం మొత్తాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యపై పనిచేశాయి. ఫ్లోరైడ్ పీడనకు ఉపరితల జలాలే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వాలు ఆ దిశలో పనిచేశాయి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇంటింటికి కృష్ణా తాగునీరు ఇవ్వడం, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కింద చెరువులను పునరుద్దరించి నీటితో నింపడతో భూగర్భ జల మట్టాలు పెరిగి ఫ్లోరైడ్ తగ్గిపోయిందన్న అభిప్రాయానికి వచ్చారు.

ఈ మేరకు భారత పార్లమెంటులో దేశవ్యాప్తంగా గుజరాత్, ఉత్తరాఖండ్, తెలంగాణలను ‘ ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్స్ ’ గా 2020 సెప్టెంబరులో ప్రకటించారు. దీంతో నల్గొండ ఇక ఫ్లోరైడ్ పీడ నుంచి బయట పడినట్లే అని అంతా భావించారు. కానీ, తాజా అధ్యయనాలు మాత్రం ఫ్లోరిన్ రక్కసి ఇంకా పొంచి ఉందని స్పష్టం చేస్తున్నాయి.

తాజా సమాచారం ఏమిటంటే..

రాష్ట్రంలో గత ఏడాది చివరలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా కొద్ది మొత్తం ఖర్చు పెడితే పూర్తయ్యి ఫలాలు అందించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. వీటిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్టు ఒకటి.

రెండు వారాల కిందట ఎస్సెఎల్బీసీ ప్రాజెక్టు పురోగతిపై సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు సాగునీటి శాఖ అధికారులు నివేదికలతో హాజరయ్యారు. వీరి నివేదికల ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా మరో మారు ఫ్లోరైడ్ గుప్పిట చిక్కే అవకాశం ఉందన్న ఆందోళనను కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.

నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో భూగర్భ జలాల్లో 10 పిపిఎం కంటే ఎక్కువగానే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 73 మండలాలు ఉండగా 23 మండలాల్లో భూగర్భ జలాల్లో నిర్ణీత పరిమితి, పరిణామాల కంటే ఎక్కువ శాతం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. నార్కెట్ పల్లి, మునుగోడు మండలాల్లోని గ్రామాల్లో 5 పిపిఎం కంటే ఎక్కవ ఫ్లోరైడ్ ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.

తగ్గినట్టే తగ్గి... మళ్లీ దాడి

జిల్లాలో నవంబర్ 2022 నాటికి యాభై శాతానికి ఫ్లోరైడ్ నిల్వలు పడిపోయాయని ప్రకటించి నిండా రెండేళ్లు నిండక ముందే తిరిగి ఫ్లోరైడ్ సమస్య తిరగబెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఫ్లోరిన్ సమస్యతో సతమతమైన 967 గ్రామాల సంఖ్య సున్నాకు చేరిందని నాటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా పనిచేసిన కేటీర్ చేసిన ప్రకటన ఇపుడు ఉత్తిదిగానే భావించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జిల్లాలో మిషన్ కాకతీయ కింద 142 చెరువులను కూడా పునరుద్దరించారు. దీంతో భూగర్భ జల మట్టాలు భాగా పెరిగడంతో ఫ్లోరైడ్ తగ్గిందనుకున్నారు. ఇండియన్ నేచురల్ రిసోర్స్ ఎకానమిక్ అండ్ మేనేజ్ మెంట్ ( ఐఎన్ఆర్ఈఎమ్) జరిపిన సర్వేలోనూ ఫ్లోరైడ్ పెరిగినట్లు గుర్తించారు. ఈ సమస్య భారిన పడిన వారు జిల్లాలో 1108 గ్రామాల్లో 19 లక్షలుగా ప్రభుత్వ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. వీరికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లాలో 2013 నవంబరులోనే డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెల్ (డిఎఫ్ఎమ్.సి) ఏర్పాటయ్యింది.

ఈ మండలాల్లో ప్రమాద ఘంటికలు

వాస్తవానికి ఫ్లోరైడ్ సమస్య ఒక్క నల్గొండ జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు. దేశంలో 22 రాష్ట్రాల్లోని 125 జిల్లాలు ఫ్లోరైడ్ భూతం బారిన పడినవే. తాజా నివేదికల మేరకు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతాలు పెరిగాయి.

అధికారిక నివేదికల ప్రకారం.. డిండి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడెం, చండూరు, మునుగోడు, నారాయణపూర్, కనగల్, గుర్రంపోడు, నల్గొండ, తిప్పర్తి, నార్కెట్ పల్లి, చిట్యాల కట్టంగూరు, చౌటుప్పల్, వలిగొండ, బీబీనగర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు తదితర మండలాల్లో భూగర్భ జలాల్లో 2 పిపిఎం నుంచి 5 పిపిఎం వరకు ఫ్లోరైడ్ శాతం ఉన్నట్లు నివేదికల సమాచారం. ‘‘ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉపరితల జలాలు మాత్రమే.

మర్రిగూడెం మండలంలో తలపెట్టిన శివన్నగూడెం రిజర్వయారు పూర్తయ్యి అందుబాటులోకి వస్తే ఫలితాలు మెరుగు పడవచ్చు. ప్రధానంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గంలో శాశ్వత పరిష్కారానికి ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందే. భూగర్భ జలాలను తాగునీటికి వినియోగించినన్ని రోజులు ఈ తిప్పలు తప్పేలా లేవు..’ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్ ‘హెచ్.టి తెలుగు’ తో పేర్కొన్నారు. అయితే, ఫ్లోరోసిస్ లక్షణాలతో ఇటీవల కాలంలో ఒక్క శిశువు కూడా పుట్టినట్లు ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాకపోవడం ఒక్కటే సంతోషించదగిన విషయమని అభిప్రాయపడుతున్నారు.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

తదుపరి వ్యాసం