Medak Medical Jobs: మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
25 July 2024, 11:50 IST
- Medak Medical Jobs: మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు.
మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు
Medak Medical Jobs: మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవ వేతన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్లు-25, అసోసియేట్ ప్రొఫెసర్లు-28, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-56 భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండి, ఎంఎస్, డిఎన్బి, పీజీ డిగ్రీలో సాధించిన మార్కులు ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ లో సాధించిన మార్కులు 50 శాతం, అర్హత పరీక్షలో 50 శాతం మార్కులు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు .
ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుదారుడి వయసు 31 మార్చి 2025 నాటికి 45 ఏళ్లలోపు ఉండాలని స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1,90,000 , అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1,25,000 ఉంటుందని తెలిపారు.
జులై 25న 11 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూ
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెదక్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆధీనంలో పనిచేయడానికి 31 మార్చి 2025 వరకు గౌరవ వేతనం ప్రాతిపదికన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు నియామకం చేస్తున్నట్లు చెప్పారు. స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు.
బయటి రాష్ట్ర అభ్యర్థులు తమ నియామకాన్ని ధ్రువీకరించడానికి ఎంపికైన వారం రోజుల్లోగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి తమ అర్హతను నమోదు చేసుకోవాలన్నారు. ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,అకాడమిక్ సర్టిఫికెట్ల ఫోటో కాపీలతో జులై 25న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పర్యవేక్షక ఛాంబర్లో ఇంటర్వ్యూలు హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ....
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, వ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతి తెలిపారు. కల్హేర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల,సామాజిక ఆరోగ్య కేంద్రం,నిజాంపేట్ మండలం లోని ట్రైబల్ వెల్ఫేర్ మిని గురుకుల పాఠశాలని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధుల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయంగా పాఠశాలలో త్రాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే తక్షణమే వైద్య క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు . ముఖ్యంగా నీళ్లు,ఆహారం కల్తీ వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించే విదంగా అవగాహన కల్పించాలని అన్నారు . వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వైద్యులు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. రాత్రి వేళల్లో డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే రోగులను పంపాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను పంపించవద్దని కలెక్టర్ ఆదేశించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)