తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Bjp : తెరపైకి విభేదాలు...! ఓరుగల్లు బీజేపీలో ఏం జరుగుతోంది..?

Warangal BJP : తెరపైకి విభేదాలు...! ఓరుగల్లు బీజేపీలో ఏం జరుగుతోంది..?

HT Telugu Desk HT Telugu

01 December 2024, 8:15 IST

google News
    • ఓరుగల్లు బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా అధ్యక్షురాలు లేకుండానే మిగతా నేతలు కలిసి కాజీపేట్ రైల్వే కోచ్ పై సంబరాల కార్యక్రమం చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు అందినట్లు తెలిసింది.
ఓరుగల్లు బీజేపీలో కోల్డ్ వార్!
ఓరుగల్లు బీజేపీలో కోల్డ్ వార్!

ఓరుగల్లు బీజేపీలో కోల్డ్ వార్!

ఓరుగల్లు బీజేపీలో కొద్దిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలికి, ఇతర నేతలకు మధ్య అంతర్గ విభేదాల కారణంగా సయోధ్య కుదరడం లేదని తెలుస్తోంది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎలక్షన్స్ టైమ్ లో పార్టీ చేరిన నేతలంతా ఒక వైపుంటే.. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మరో వైపున్నట్లు స్పష్టమవుతోంది. 

తాజాగా కాజీపేటలోని వ్యాగన్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ను కోచ్ ఫ్యాక్టరీ గా అప్ గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సంబరాలు జరుపుకునే సందర్భంలోనే ఈ విషయం బయటపడింది. కొద్దిరోజుల్లోనే పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్న తరుణంలో ఓరుగల్లు బీజేపీ నేతల తీరుపై చర్చ జరుగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఫీల్డ్ లో బలమైన క్యాడర్ ను కలిగి ఉన్న బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పోటీ ఇవ్వగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీలంతా ఒకవైపు..?

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుతం రావు పద్మారెడ్డి కొనసాగుతున్నారు. కొంతకాలంగా పార్టీని బలోపేతం చేస్తూ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేయడమే కాకుండా.. గత ప్రభుత్వ హయాంలో ఏ సందర్భం వచ్చినా నిరసనలు, ఆందోళనలతో పార్టీని జిల్లాలో యాక్టీవ్ చేశారు. దీంతో గత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 10 కార్పొరేటర్ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 

ఇంతవరకు బాగానే ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రావు పద్మారెడ్డి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం జనరల్ స్థానం కాగా.. ఆ టికెట్ కోసం రావు పద్మారెడ్డితో పాటు మార్తినేని ధర్మారావు, చాడ శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు నేతలు పోటీ పడ్డారు. కానీ అధిష్టానం రావు పద్మారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆశావహులంతా నిరాశకు గురయ్యారు. ఇదిలాఉంటే 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన మార్తినేని ధర్మారావు 5,979 ఓట్లు సాధించగా.. గతంలో ఎన్నడూ లేనంతగా 2023 శాసనసభ ఎలక్షన్స్ లో రావు పద్మారెడ్డి 30 వేల మార్క్ దాటింది. మొత్తంగా 30,826 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 

కాగా పార్టీలో ఉన్న కొందరు నేతలు కూడా ఆమె ఓటమికి కారణమయ్యారనే టాక్ నడిచింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కటయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత ఎంపీ ఎలక్షన్స్ జరగగా.. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన అరూరి రమేష్ కు పోటీ చేసే అవకాశం దక్కింది. ఎంపీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన కూడా మాజీల చెంతనే చేరాడనే ప్రచారం ఉంది.

సంబరాలతో బయటపడ్డ విభేదాలు

కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ మ్యానుఫాక్షరింగ్ యూనిట్ ను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 28న ‘ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’గా అప్ గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందన్న ఉద్దేశంతో 30వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపేందుకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలకు కూడా సమాచారం ఇచ్చారు. 

ఇంతవరకు బాగానే ఉండగా.. పార్టీ జిల్లా అధ్యక్షురాలిని పక్కన పెట్టేసి 29వ తేదీనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరూరి రమేశ్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ రాజేశ్వరరావు, ఇతర నేతలంతా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించనున్న అయోధ్యపురం స్థలాన్ని పరిశీలనకు వెళ్లారు. జిల్లా అధ్యక్షురాలు లేకుండానే కాజీపేట మీడియా పాయింట్ లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. వారితో పార్టీ జిల్లా అధ్యక్షురాలు కనిపించకపోవడం పట్ల చర్చ జరగగా.. 30వ తేదీన రావు పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సంబరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలున్నాయనే విషయం బయట పడింది.

పార్టీ అధిష్టానం దృష్టికి.. !

కోచ్ ఫ్యాక్టరీ సంబరాలతో బీజేపీలో విభేదాలు బయట పడగా.. తనను కాదని పాలాభిషేకాలు, ఇతర సెలబ్రేషన్స్ నిర్వహించిన నేతల పట్ల రావు పద్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. జిల్లా అధ్యక్షురాలి ప్రొటోకాల్ పాటించకుండా తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా సంబరాలు జరిపిన విషయాన్ని రావు పద్మారెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఇదిలాఉంటే పార్టీ జిల్లా నేతల మధ్య అంతర్గత విభేదాలు.. క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేదనే అభిప్రాయాలు వినిపిస్తుండగా.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపుతుందోననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రూట్ లెవల్ లో బలమైన క్యాడర్ తో బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగా.. బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం