Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమల వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త
01 December 2024, 14:24 IST
- Ayyappa Devotees : అయ్యప్ప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే.. శబరిమలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. శబరిమలలో వర్షాలు కురుస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. అటు వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శబరిమల
ఫెంగల్ తుపాను ప్రభావంతో డిసెంబర్ 4 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. శబరిమలకు అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతోపాటు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే శబరిమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంలోనూ అయ్యప్ప భక్తులు దర్శనానికి వేలాదిగా తరలివస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రస్తుతం 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో.. దర్శనం త్వరగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సహాయం కోసం..
శబరిమలలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని దేవస్థానం బోర్డు సూచించింది. దర్శనం అనంతరం, ముందు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. వాహనాల్లో ప్రయాణించే భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సమాచారం అందించాలని, సహాయం కోసం సూచించిన ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని స్పష్టం చేసింది.
సురక్షితంగా చేరుకోవడానికి..
నీలిమల, అప్పచ్చిమేడు మీదుగా భక్తులను అయ్యప్ప సన్నిదానంలోకి అనుమతిస్తున్నారు. నీలిమల మార్గంలో మొత్తం 18 నడపండలు ఏర్పాటు చేశారు. మరకూట్టం నుండి శరంకుతి వరకు క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. ప్రజలు వర్షంలో చిక్కుకోకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే పంబాలో భారీ వర్షం కురవడంతో సన్నిదానం నుంచి చంద్రనాదన్ రోడ్డు, స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా దిగే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది.
హై అలర్ట్..
శబరిమల ఆలయం, పంబలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పంబా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. నదిలో ప్రమాదాలు జరగకుండా జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అన్ని నివారణ చర్యలు చేపట్టింది. డీడీఎంఏతో పాటు నీటిపారుదల శాఖ కూడా పంబలో నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తోంది. జాతీయ విపత్తు రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్, అగ్నిమాపక దళం, పోలీసులు గుడి, ప్రాంగణంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
తుపాను ఎఫెక్ట్..
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ విమానాలు, రైళ్లు, బస్సులపై పడింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే ట్రైన్స్ ఆలస్యం అవుతున్నాయి. ఘాట్ రోడ్డుల్లో రాకపోకలు సాగించే బస్సులను కూడా చాలా వరకు నిలిపేశారు. అటు విమానాలపై సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. చాలా సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. శబరిమల వెళ్లడానికి ప్లాన్ చేసుకున్న భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.