TGSRTC Conductor Arrest : ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్య ప్రవర్తన, కండక్టర్ అరెస్ట్
17 July 2024, 17:54 IST
- TGSRTC Conductor Arrest : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కండక్టర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని యువతి ట్విట్టర్ లో పోస్టు చేసింది. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్య ప్రవర్తన, కండక్టర్ అరెస్ట్
TGSRTC Conductor Arrest : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బస్సు రద్దీగా ఉండడంతో అదనుగా భావించిన కండక్టర్ ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మణికొండ నుంచి హిమాయత్ నగర్ కు వెళుతున్న ఓ యువతి (21)......మెహదీపట్నంలో 64M/123 బస్సు ఎక్కింది. బస్సు ఎక్కేటప్పటికీ అది చాలా రద్దీగా ఉంది. అయితే తాను ఆధార్ కార్డు మార్చిపోవడంతో టికెట్ ఇవ్వాలని కండక్టర్ ను కోరింది. ఆ సమయంలో కండక్టర్ ఆ యువతి చేతిని తాకాడు.
యువతితో కండక్టర్ అసభ్య ప్రవర్తన
బస్సు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల చేయి తాకి ఉండొచ్చులే అని తొలుత యువతి భావించింది. ఇక ఇదే అదనుగా భావించిన కండక్టర్ ఆమె చాతి భాగంపై తాకడం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్ భాగాలను సైతం తాకాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేసింది. అంత రద్దీగా ఉన్న అందరూ చూస్తుండగానే ఇది జరిగింది. ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి ఎదురు కాకూడదు. ఏ అమ్మాయి మౌనంగా బాధ పడకూడదు. దయచేసి కండక్టర్ పై కఠిన చర్యలు తీసుకోండి. అంటూ సదరు యువతి ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ సంస్థ, కేటీఆర్, షీ టీమ్స్ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. దీంతో పాటు ఆమె బస్సులో చిత్రీకరించిన కండక్టర్ వీడియోను అలాగే బస్ టికెట్ ను కూడా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
స్పందించిన సంస్థ
యువతి ఫిర్యాదుపై ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందించారు. ఫరూక్ నగర్ డిపోకు చెందిన కండక్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కండక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. ఇలాంటి వాటిపై సంస్థ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఆయన వెల్లడించారు. మరోవైపు ట్విట్టర్ లో యువతి చేసిన ఫిర్యాదుకు అనేక మంది స్పందించరు. తామంతా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ఆ యువతికి భరోసానిచ్చారు.
కండక్టర్ అరెస్ట్
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ ఘటనపై రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో కండక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కండెక్టర్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.