తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak Case : తమ్ముడి కోసం ఏఈ పేపర్ కొన్న ఎంపీడీవో అధికారి, ఇద్దర్నీ అరెస్టు చేసిన సిట్

TSPSC Paper Leak Case : తమ్ముడి కోసం ఏఈ పేపర్ కొన్న ఎంపీడీవో అధికారి, ఇద్దర్నీ అరెస్టు చేసిన సిట్

05 May 2023, 13:05 IST

google News
    • TSPSC Paper Leak Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తన తమ్ముడి కోసం భగవంత్ కుమార్ అనే వ్యక్తి ఏఈ పేపర్ కొనుగోలు చేశాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు (File Photo )

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు

TSPSC Paper Leak Case : తెలంగాణలో సంచలనమైన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్‌ కుమార్, అతని సోదరుడు రవికుమార్‌‌ను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. తన తమ్ముడు రవికుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి భవంత్ కుమార్ ఏఈ పేపర్‌ను కొనుగోలు చేశాడు. ఏఈ పేపర్‌ కోసం డాక్యా నాయక్ రూ.2 లక్షలు అడగగా...భగవంత్‌ కుమార్ రూ.1.75 లక్షలు ఇచ్చారు. డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలించగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో భగవంత్‌ రావు, అతడి సోదరుడు రవికుమార్ ను సిట్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తన తమ్ముడు రవికుమార్ కోసమే పేపర్ కొనుగోలు చేసినట్లు భగవంత్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. వీరి అరెస్ట్‌తో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 22కు చేరింది.

భారీగా చేతులు మారిన నగదు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుల మధ్య రూ.33.4 లక్షలు చేతులు మారినట్లు సిట్‌ గుర్తించింది. కొందరు పేపర్ల విక్రయించి నగదు తీసుకుంటే, మరికొందరు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నట్లు గుర్తించారు. టీఎస్పీఎస్సీ పేపర్లను విక్రయించిన కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు ఈ వ్యవహారంలో రూ.16 లక్షలు అందినట్టు గుర్తించారు. కేతావత్‌ రాజేశ్వర్‌, డాక్యా నాయక్ లు పేపర్లను అయిదుగురికి రూ.10 లక్షల చొప్పున విక్రయించడానికి బేరం మాట్లాడుకున్నారు. రూ.50 లక్షలకు ప్లాన్ వేసినా వాళ్లంతా ఆ మొత్తం ఇవ్వలేదు. నీలేశ్‌ నాయక్‌ అనే అభ్యర్థి రూ.4.95 లక్షలు, గోపాల్‌ నాయక్‌ రూ.8 లక్షలు, ప్రశాంత్‌రెడ్డి రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్‌ రూ.5 లక్షలు, వెంకట జనార్దన్‌ రూ.1.95 లక్షలు ఇచ్చారు. అయిదుగురి నుంచి మొత్తం రూ.27.4 లక్షలు రాజేశ్వర్, డాక్యా నాయక్ కు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వెంకట జనార్దన్‌ నగదును డాక్యా బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయగా... మిగిలిన వారు నగదు రూపంలో ఇచ్చారు. ఈ డబ్బులో రూ.10 లక్షలు ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వగా... వారికి రూ.17.4 లక్షలు మిగిలాయి.

పేపర్ల విక్రయించిన డబ్బుతో ప్రభుత్వ పనులు

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్‌, ఖమ్మంకు చెందిన సాయి లౌకిక్‌, సాయి సుస్మిత దంపతులకు విక్రయించాడు. ఈ డీల్ లో ప్రవీణ్‌ కుమార్‌కు రూ.6 లక్షలు అందాయి. ఈ నగదుతో కలిపి ప్రవీణ్‌ కుమార్‌కు రూ.16 లక్షలు, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లకు రూ.17.4 లక్షలు దక్కాయి. ఈ మొత్తం వ్యవహారంలో రూ.33.4 లక్షల నగదు చేతులు మారినట్లు కోర్టుకు సిట్‌ నివేదిక అందజేసింది. ఏఈ పేపర్ విక్రయించగా వచ్చిన సొమ్ముతో రేణుకా సోదరుడు రాజేశ్వర్‌ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశాడు. గండీడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండాలో రూ.3 లక్షలతో హైమాస్ట్‌ లైట్ల బిగింపు పనులు, రూ.1.8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పైపుల పనులు చేశాడు. డాక్యా నాయక్ బ్యాంకు ఖాతాలో రూ.3.95 లక్షలున్నట్లు సిట్ అధికారులు గుర్తించి ఫ్రీజ్ చేశారు.

తదుపరి వ్యాసం