TG Academic Calendar 2024-25 : తెలంగాణ విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల, దసరా సెలవులు ఎప్పుడంటే?
Updated May 25, 2024 02:36 PM IST
- TG Academic Calendar 2024-25 : వచ్చే విద్యా సంవత్సరం(2024-25) క్యాలెండర్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి.
తెలంగాణ విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల, దసరా సెలవులు ఎప్పుడంటే?
TG Academic Calendar 2024-25 : తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు కాగా, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
229 పనిదినాలు
తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతుల వరకు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి. జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్ 23, 2025తో ముగుస్తాయి. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి. అలాగే అక్టోబర్ 13 నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండాయని ప్రకటించింది.
పరీక్షల షెడ్యూల్
అలాగే పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది. జులై 31, 2024లోగా ఫార్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు, సెప్టెంబర్ 30, 2024 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు, డిసెంబర్ 12 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-3 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జనవరి 29, 2025 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-4 పరీక్షలను, వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి 29 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను(1 నుంచి 9 క్లాస్ లకు) నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు 2025 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ నిర్వహించున్నారు. మార్చి, 2025లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది.
మే 27న క్యాజువల్ లీవ్
తెలంగాణలో మే 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27న సెలవు దినంగా(క్యాజువల్ లీవ్) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయనుంది.