Hyderabad News : షాకింగ్ ఘటన- గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి, సీసీకెమెరాల్లో రికార్డు
12 November 2024, 14:26 IST
Hyderabad News : హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ఓ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ యువకుడు గుండెపోటుతో మరణించాడు. అప్పటి వరకూ ఆలయంలో ప్రదక్షిణలు చేసిన యువకుడు..ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.
షాకింగ్ ఘటన- గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
కరోనా మహమ్మారి తర్వాత సడెన్ హార్ట్ స్ట్రోక్స్ అధికమయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ దుష్పరిణామాలు, కరోనా వ్యాక్సిన్ ప్రభావంతో గుండె సంబంధిత వ్యాధులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ లోని ఓ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు.
ప్రదక్షిణలు చేస్తూ యువకుడు మృతి
ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె.విష్ణువర్ధన్ (31) అనే యువకుడు... కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న(సోమవారం) ఉదయం... తన హాస్టల్ సమీపంలోని వీరాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేశాడు. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో యువకుడు గుండెపోటుకు గురయ్యారు.
యువకుడు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రదక్షిణ అనంతరం నీళ్లు తాగేందుకు వాటర్ ఫిల్టర్ వద్దకు వచ్చిన విష్ణువర్ధన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించినా ఫలితంలేకపోయింది. విష్ణువర్ధన్ ఇటీవల వైరల్ ఫీవర్ తో బాధపడినట్లు తెలుస్తోంది. పోలీసులు యువకుడి మృతదేహానికి పోర్టుమార్టమ్ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడు గుండెపోటుకు గురైన పడిపోయిన దృశ్యాలు ఆలయ సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం తప్పింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు నడుపుతున్న డ్రైవర్ కిరణ్ కుమార్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అతడు వెంటనే ఎడమ వైపునకు ఒరిగిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగంగా దూసుకుపోతుంది. అప్పటికే రోడ్డుపై ఓ వాహనాన్ని ఢీకొంటూ ముందుకు వెళ్లింది. డ్రైవర్ ను గమనించిన కండక్టర్ వెంటనే స్పందించారు. కండక్టర్ ఓబలేష్ డ్రైవర్ సీటులోకి వెళ్లి స్టీరింగ్‌ను కంట్రోల్ చేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నేలమంగళ నుంచి దసనాపుర డిపోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
డ్రైవర్ గుండెపోటుతో పక్కకు పడిపోవడం, బస్సు వేగంగా రోడ్డుపై మరో బస్సును ఢీకొన్న దృశ్యాలు, కండక్టర్ సాహసం...బస్సులోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నియంత్రించడంతో ప్రయాణికులంతా ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.