Tamilisai Vs KCR : మరోసారి తెరపైకి ప్రోటోకాల్ వివాదం, సీఎం కేసీఆర్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
25 April 2023, 8:44 IST
- Tamilisai Vs KCR : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతోంది. రెండేళ్లుగా సీఎం కేసీఆర్ తనతో భేటీ కాలేదని గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్‌తో కేసీఆర్ సర్కారుకు సయోధ్య కుదిరేనా?
Tamilisai Vs KCR : తెలంగాణలో ప్రగతి భవన్ వర్సె్స్ రాజ్ భవన్ వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదని గవర్నర్ తమిళిసై తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి గవర్నర్ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ నిబంధనల ప్రకారం పాటించాల్సిన ప్రోటోకాల్ అమలు చేయడంలేదని విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం సీఎం, గవర్నర్ మధ్య తరచూ చర్చలు జరగాలని కానీ తెలంగాణలో ఆ పరిస్థితిలేదన్నారు. అందుకు తాను కారణం కాదన్నారు. సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధం ఉండాలని, కానీ రెండేళ్లుగా సీఎం కేసీఆర్ తనకు కలవలేదన్నారు. పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
పెండింగ్ బిల్లులపై నిర్ణయం
గవర్నర్ తమిళిసై ఉద్దేశపూర్వకంగా బిల్లులు పెండింగ్ లో పెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో తమిళిసై పెండింగ్ బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పెండింగ్ బిల్లులను గవర్నర్ క్లియర్ చేశారు. ఇందులో ఒక దానిని తిరస్కరించగా, మిగిలిన రెండు బిల్లులకు సంబంధించి ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు. తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. పెండింగ్ బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా గవర్నర్ కు సూచించింది.
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు
తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మంచి సంబంధాలు లేవు. ఈ విషయంపై గవర్నర్ తమిళి సై బహిరంగంగానే స్పందిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించడంలేదని, అధికారులు ఎవరూ తనను కలవడంలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు ఎలాంటి ఆహ్వానం లేదన్నారు. ఆహ్వానం అంది ఉంటే, ఇలాంటి కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానన్నారు.
రాజ్ భవన్ కు రావాల్సింది
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని భావించారు. కానీ పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం ముగియలేదని స్పష్టమైంది. బిల్లులపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఈ వివాదంపై గవర్నర్ అప్పట్లో స్పందిస్తూ.. దిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని సీఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.