144 Section In Hyderabad : హైదరాబాద్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్- ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం
28 October 2024, 14:47 IST
144 Section In Hyderabad : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు.
హైదరాబాద్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్- ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 144 సెక్షన్(ప్రస్తుతం సెక్షన్ 163 ) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీల బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు హైదారాబాద్ సీపీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతటా బహిరంగ సభలు, ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 27 నుంచి అమల్లోకి ఆంక్షలు
బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా చిహ్నాలు లేదా సందేశాల ప్రదర్శనను నిషేధించింది. ఈ నిషేధం అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అమలులోకి వచ్చిందన్నారు. వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రదర్శనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలకు ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. శాంతియుత ధర్నాలు, నిరసనలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అనుమతిస్తామన్నారు.
ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రత్యేకంగా సెక్రటేరియట్, ఇతర సున్నితమైన ప్రాంతాల వద్ద నిరసనలకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం తదిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్ లో సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
నెటిజన్ ట్వీట్, సీపీ ఆనంద్ రిప్లై
హైదరాబాద్ లో ఆంక్షలు విధించడంపై ఓ నెటిజన్ సీపీ సీవీ ఆనంద్ ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. "ప్రభుత్వం భయపడుతుందా? నగరంలో సమావేశాలు, ప్రజల సమూహం లేకుండా 144 సెక్షన్లు అమలు చేస్తున్నారు. వాహ్ గొప్ప ప్రభుత్వానికి గొప్ప పని" అని ట్వీట్ చేశారు.
నెటిజన్ ట్వీట్ పై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ నోటిఫికేషన్‌కు దీపావళి పండుగ వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనేక రకాల ఆందోళనలు, సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ మొదలైన వాటిపై ఆకస్మిక దాడులు, నిరసనలకు కొన్ని గ్రూపులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. వీటిని కట్టడి చేసేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. ఇలాంటి చర్యలు అవసరాన్ని దేశవ్యాప్తంగా పోలీసులు సాధారణంగా అమలు చేస్తున్నవే అని స్పష్టత ఇచ్చారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఇది కర్ఫ్యూ కాదని వివరణ ఇచ్చారు. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండని సీపీ ఆనంద్ నెటిజన్ కు హితవు పలికారు.