TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో భారీగా చేతులు మారిన నగదు..
05 May 2023, 6:46 IST
- TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు సిట్ గుర్తించింది. ప్రధాన నిందితుడు ప్రశ్నాపత్రాలను విక్రయించి రూ. పదిలక్షలు వసూలు చేయగా, మిగిలిన వారు వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు గుర్తించారు.
పేపర్ లీక్ కేసులో లక్షల్లో చేతులు మారిన నగదు
TSPSC Paper Leak: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో నగదు లావాదేవీలపై సిట్ దృష్టిసారించింది. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగిటనట్టు గుర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుల మధ్య రూ.33.4 లక్షలు చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఈ కేసులో కొందరు ప్రశ్నాపత్రాలను విక్రయించి నగదు తీసుకుంటే, మరికొందరు బ్యాంకు ఖాతాలలోకి బదిలీ చేయించుకున్నట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రాలను విక్రయించిన కమిషన్ కార్యదర్శి పిఏ పులిదిండి ప్రవీణ్‌కుమార్‌కు ఈ వ్యవహారంలో రూ.16 లక్షలు అందుకున్నట్టు గుర్తించారు.
ఏఈ సివిల్ నియామక ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకారాథోడ్, ఆమె భర్త డాక్యానాయక్‌కు ఇచ్చేందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రేణుక తన సోదరుడు కేతావత్ రాజేశ్వర్ కోసమంటూ దానిని కొనుగోలు చేసింది.
ఆ తర్వాత కేతావత్ రాజేశ్వర్, డాక్యాలు ఆ ప్రశ్నపత్రాన్ని అయిదుగురికి రూ.10 లక్షల చొప్పున విక్రయించడానికి బేరం పెట్టారు. రూ.50లక్షల వసూలు చేయాలని పథకం వేసినా సంప్రదించిన వారంతా ఆ మొత్తం ఇవ్వలేదు. నీలేశ్‌నాయక్ అనే అభ్యర్ధి రూ.4.95 లక్షలు, గోపాల్‌నాయక్ రూ.8 లక్షలు, ప్రశాంత్‌రెడ్డి రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్ రూ.5 లక్షలు, వెంకట జనార్దన్ రూ.1.95 లక్షలు ఇచ్చారు. ఐదుగురి నుంచి మొత్తం రూ.27.4 లక్షలు వారికి వచ్చాయి. వెంకట జనార్దన్ నగదును డాక్యా బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. మిగిలిన వారు నగదు రూపంలో ఇచ్చారు. ఈ డబ్బులో రూ.10 లక్షలను ప్రవీణ్‌కుమార్‌కు ఇచ్చారు. వారికి రూ.17.4 లక్షలు మిగిలాయి.
మరోవైపు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్, ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సాయిసుస్మిత దంపతులకు అమ్మాడు. ఇందుకోసం ప్రవీణ్‌కుమార్‌కు రూ.6 లక్షలు చెల్లించారు. వీటితో కలిపి ప్రవీణ్‌కుమార్‌కు రూ.16 లక్షలు, డాక్యా, రాజేశ్వర్‌లకు రూ.17.4 లక్షలు దక్కాయి. ఈ మొత్తం వ్యవహారంలో రూ.33.4 లక్షల నగదు లావాదేవీలు జరిగాయని కోర్టుకు సిట్ నివేదిక అంద చేసింది.
పేపర్ లీక్ కేసు సొమ్ము స్వాధీనం…
డీఏవో ప్రశ్నపత్రం విక్రయంతో వచ్చిన సొమ్మును ప్రవీణ్‌కుమార్ బ్యాంకులో ఖాతాలోనే దాచాడు. బాలాపూర్ క్రాస్‌రోడ్డు ఎస్‌బీఐ శాఖలోని అతడి ఖాతాలో ఉన్న సొమ్మును సిట్ అధికారులు స్తంభింపజేశారు. రేణుక బృందం నుంచి తనకు వచ్చిన రూ.10 లక్షల్లో రూ.3 లక్షల్ని ప్రవీణ్‌కుమార్ తన మేనమామ శ్రీనివాసరావుకు అవసరం నిమిత్తం ఇచ్చాడు. ప్రవీణ్‌పై కేసు నమోదైన తర్వాత శ్రీనివాసరావు మార్చి 28న ఆ డబ్బును సిట్ అధికారులకు అప్పగించాడు.
పేపర్ లీక్ సొమ్ముతో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు
ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించగా వచ్చిన సొమ్ములో నుంచి కొంతమొత్తంతో రేణుకా సోదరుడు రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశాడు. గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాలో రూ.3 లక్షలతో హైమాస్ట్ లైట్ల బిగింపు పనులు, రూ.1.8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పైపుల పనులు చేపట్టాడు. పాత అప్పులు తీర్చేందుకు రూ.4.5 లక్షలు వెచ్చించాడు. డాక్యా బ్యాంకు ఖాతాలో రూ.3.95 లక్షలున్నట్లు గుర్తించి సిట్ అధికారులు వాటిని ఫ్రీజ్ చేశారు.
ఉచితంగా ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి…
పేపర్ లీక్ కేసులో కంప్యూటర్ల నుంచి వాటిని బయటకు తీయడంలో కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి గ్రూప్ వన్ పేపర్‌ను ఎవరికి విక్రయించ లేదని గుర్తించారు. నిందితుడు అట్ల రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉంటున్న తన బావ సానా ప్రశాంత్‌తోపాటు టీఎస్‌పీఎస్సీలో ఏఎస్‌వోగా పనిచేసిన షమీమ్‌కు ఉచితంగా వాటిని ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్‌కుమార్ కూడా టీఎస్‌పీఎస్సీ మాజీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేశ్, కమిషన్‌లో డేటాఎంట్రీ ఆపరేటర్ రమేశ్‌కుమార్‌కు గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని ఉచితంగా ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.