తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress Govt : కాంగ్రెస్ ఏడాది పాలన - ఉద్యోగాల భర్తీ ఎక్కడి వరకు వచ్చింది..?

Telangana Congress Govt : కాంగ్రెస్ ఏడాది పాలన - ఉద్యోగాల భర్తీ ఎక్కడి వరకు వచ్చింది..?

06 December 2024, 17:11 IST

google News
    • తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావొచ్చింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల భర్తీకి పలు చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. కొత్తగా టీచర్లను రిక్రూట్ చేయగా.. మరోవైపు గ్రూప్ 1, 3 పరీక్షలను కూడా నిర్వహించింది.
తెలంగాణలో ఉద్యోగ నియామకాలు
తెలంగాణలో ఉద్యోగ నియామకాలు

తెలంగాణలో ఉద్యోగ నియామకాలు

తెలంగాణలో రేవంత్ సర్కార్ కు ఏడాది పూర్తి కావొచ్చింది. డిసెంబర్ 9వ తేదీతో సంవత్సరం పూర్తి కానుంది. కీలకమైన హామీలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో ఉద్యోగాల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది. కీలకమైన గ్రూప్స్ పరీక్ష పత్రాలు లీక్ కావటంతో చాలా ఎగ్జామ్స్ రద్దయ్యాయి. నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేశారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే యువతను తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్ పార్టీ కీలకమైన హామీలను ఇచ్చింది. నిరుద్యోగ డిక్లరేషన్ సభలను నిర్వహించి.. ఉద్యోగాల భర్తీపై కీలకమైన ప్రకటన చేస్తూ వచ్చింది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి… తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని పట్టాలెక్కించారు. అయితే ఉద్యోగాల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్… టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులు రాజీనామా చేయటంతో కొత్త వారిని ఎంపిక చేసింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంది.

గ్రూప్ 1 పరీక్షలు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. అప్పటికే రెండు సార్లు రద్దైన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ రాగా… కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో 60 పోస్టులను కలిపింది. దీంతో పోస్టుల సంఖ్య పెరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలను పూర్తి ఫలితాలను కూడా ఇచ్చింది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మూల్యాంకనం జరగుతోంది. ఫిబ్రవరి నాటికి ఈ పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. మరోవైపు కీలకమైన గ్రూప్ 3 పరీక్షలను కూడా ప్రభుత్వం నిర్వహించింది. ఇదే నెలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. పరీక్ష తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే ఏడాది ప్రకటించనుంది.

డీఎస్సీ రిక్రూట్ మెంట్ పూర్తి…

మరోవైపు తెలంగాణలోని రేవంత్ సర్కార్… ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీను నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా… రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేవలం 56 రోజుల్లోనే డిఎస్సీ ఫలితాలు వెలువరించినట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన వారికి హైదరాబాద్ వేదికగా నియామక పత్రాలను అందజేశారు.

ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… వైద్యారోగ్యశాఖలో భారీగా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఫలితాలు రావాల్సి ఉంది. 2,322 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. గత నెలలోనే పరీక్షలు పూర్తయ్యాయి. ఈ ఫలితాలు కూడా రావాల్సి ఉంది. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వగా.. పరీక్షలను పూర్తి చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది. దాదాపు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుండగా.. త్వరలోనే నియామక పత్రాలను అందజేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.

ఇక గ్రూప్ 4 కు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసింది. ఇటీవలనే ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. గత ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహించిన వాటి ఫలితాలను ప్రకటించి… వారికి కూడా నియామక పత్రాలు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా గురుకులాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఏడాది కాలం పూర్తి అవుతున్న వేళ కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన విజయోత్సవాలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు వేదికలపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్నారు. పాత నోటిఫికేషన్లలోని ఇబ్బందుల పరిష్కరించటంతో పాటు కోర్టుల్లో కేసులు పరిష్కరించి ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రస్తావించారు.

మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్… నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పూర్తి చేశామని.. కేవలం ఫలితాలు ప్రకటించిన కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ దుయ్యబడుతోంది.

తదుపరి వ్యాసం