తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Row : నిఘా నీడలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. భారీగా పోలీసుల బందోబస్తు!

TGPSC Group 1 Row : నిఘా నీడలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. భారీగా పోలీసుల బందోబస్తు!

20 October 2024, 12:02 IST

google News
    • TGPSC Group 1 Row : హైదరాబాద్ నగరం గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. ఇందుకోసం భారీగా పోలీసులను మోహరిస్తోంది.
పోలీసుల బందోబస్తు
పోలీసుల బందోబస్తు (istockphoto)

పోలీసుల బందోబస్తు

తెలంగాణలో 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం హైదరాబాద్‌ పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాల తరలింపులో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పకడ్బందీ పర్యవేక్షణ..

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద ఎస్సైల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరికి అదనంగా పోలీస్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తరచూ సందర్శిస్తుంచనుంది. పరీక్షల పర్యవేక్షణకు 3 కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్‌ అధికారిగా నియమించారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 46 కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్..

ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు తరలించే వాహనాలకు తొలిసారిగా జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఉపయోగించనున్నారు. వీటిని టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 తర్వాత గేట్లు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

మరోసారి ఉద్రిక్తత..

ఇటు హైదరాబాద్‌‌లోని అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్‌లో గ్రూప్‌ 1 అభ్యర్థులు రోడ్డెక్కారు. పెద్ద సంఖ్యలో రోడ్డు పైకి చేరుకున్న నిరుద్యోగులకు.. ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మంత్రుల సమాలోచనలు..

గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్హులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు.

సుప్రీంకోర్టుకు..

గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై రేపు(సోమవారం) విచారణ జరిగనుంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైకోర్టులో అభ్యర్థులకు ఊరట దక్కలేదు. పరీక్షలు ప్రారంభం రోజే కోర్టు విచారణ ఉండటంతో... గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

తదుపరి వ్యాసం