Group 1 Mains Exam : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. గేట్లు మూసివేసిన అధికారులు
21 October 2024, 14:40 IST
- Group 1 Mains Exam : తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పుతో గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అవ్వడంతో.. అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 31వేల 383 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ రాస్తున్నారు. నిబంధనల ప్రకారం.. పరీక్ష కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. గ్రూప్ 1 పరీక్ష జరుగుతున్న కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
సోమవారం మధ్యాహ్నం.. పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల ప్రారంభానికి కాసేపటి కిందట సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అపెక్స్ కోర్టు తీర్పుతో గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. 'గ్రూప్ 1 అభ్యర్ధుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ హర్షణీయం. గ్రూప్ 1 అభ్యర్ధుల పిటిషిన్‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేయడం శుభ పరిణామం. ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయి' అని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
'ఈ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేయడం గ్రూప్ 1 అభ్యర్ధులకు సంతోషకరం. ఏలాంటి ఆలోచనలు లేకుండా పరీక్షలు రాసుకోవాలి. 13 సంవత్సరాలు తర్వాత వచ్చిన అవకాశం ఇది. దీనిని అభ్యర్ధులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నత ఉద్యోగాలు పొందాలి. మేము మొదటి నుంచి గ్రూప్ 1 అభ్యర్ధులకు అండగా ఉంటున్నాం. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూ వస్తున్నాం' అని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.
'జీవో 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నా. నేను బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్నా. రిజర్వేషన్లకు ఎలాంటి అన్యాయం జరగదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి.. భవిష్యత్తును బాగుచేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు శుభాకాంక్షలు' అని మహేశ్ వ్యాఖ్యానించారు.