తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao : పథకాల కేసీఆర్ పోయి.. ఫొటోలకు ఫోజులిచ్చే రేవంత్ రెడ్డి వచ్చారు : హరీష్ రావు

Harish Rao : పథకాల కేసీఆర్ పోయి.. ఫొటోలకు ఫోజులిచ్చే రేవంత్ రెడ్డి వచ్చారు : హరీష్ రావు

HT Telugu Desk HT Telugu

20 October 2024, 17:46 IST

google News
    • Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్ అని ఎద్దేవా చేశారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను.. అందరిని దగా చేశారని ఆరోపించారు.
అలయ్ బలయ్‌లో మాట్లాడుతున్న హరీష్ రావు
అలయ్ బలయ్‌లో మాట్లాడుతున్న హరీష్ రావు

అలయ్ బలయ్‌లో మాట్లాడుతున్న హరీష్ రావు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో.. అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావు హజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడ్డారు. 6 గ్యారంటీ స్కీమ్‌లు అమలు అయ్యేవరకు.. పేదలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

బందిపోట్లను దొంగలను కొట్టినట్లు నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ చేయించారని హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఏది మీ జాబ్ క్యాలెండర్? ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్‌కు రావాలని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగేలా ఉన్న జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

డైవర్షన్ పాలిటిక్స్..

6 గ్యారంటీలు అమలు చేయమంటే పైసల్ లేవ్ అంటున్న రేవంత్ రెడ్డి.. మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లు ఎక్కడివని హరీష్ రావు ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే మూసీ సుందరీకరణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణకు అడ్డువస్తే బుల్డోజర్‌తో తొక్కిస్తామంటున్న రేవంత్ రెడ్డి.. చంపుతామన్నా, కేసులు పెడతామన్నా, అక్రమ అరెస్టులు చేస్తామన్నా.. బిఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు.

ఊరుకుందామా.. ఉరికిద్దామా?

కరోనా కష్టకాలంలో ఖజానా ఖాళీ ఉన్న సమయంలో.. వానకాలం ఆరంభంలోనే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించిందని.. హరీష్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు కరోనా లాంటి కష్టం ఉందా? ఎందుకు రైతుబంధు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎకరానికి 10 వేలు కాదు.. 15 వేలు ఇస్తామని, అసలుకే ఎసరు పెట్టారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది మాసాలు గడిచినా.. పెన్షన్‌దారులకు కేవలం 8 నెలల ఇచ్చారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే కేవలం సన్న వడ్లకు, అదికూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటేనే బోనస్ ఇస్తామంటున్నారని ఆక్షేపించారు.

సన్న వడ్లకు ప్రభుత్వం ఇచ్చే బోనస్‌తో కలిపి క్వింటాల్‌కు రూ.2800 వస్తే.. బహిరంగ మార్కెట్లో 3 వేల రూపాయలు వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు సన్న వడ్లు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. సన్న వడ్ల బోనస్ కూడా గుండు సున్నా అవుతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉరుకుందామా? కాంగ్రెసోళ్లను ఉరికిద్దామా.. అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు.

బస్సు ఫ్రీ తప్ప.. అన్ని తుస్సే..

ఎన్నికల ముందు కాంగ్రెస్ మహిళలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ తప్ప.. అన్ని తుస్సే అయ్యాయని హరీష్ రావు విమర్శించారు. లక్ష కోట్లు వడ్డీలేని రుణం అన్నారు.. కానీ 5 లక్షల వరకే ఇస్తున్నట్లు జీవో ఉందని తెలిపారు. బతుకమ్మ చీరలను రద్దు చేయడంతో పాటు.. ఆడబిడ్డలకు తులం బంగారం, నెలకు రూ.2500 నగదు గురించి ప్రస్తావన లేకుండా పోయిందన్నారు. పథకాల కేసీఆర్‌ను పోగొట్టుకుని.. ఫోటోలకు ఫోజులు ఇచ్చే రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం