తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao Vs Revanth Reddy : ఊసరవెల్లి కూడా రేవంత్‌ను చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది : హరీష్ రావు

Harish Rao vs Revanth Reddy : ఊసరవెల్లి కూడా రేవంత్‌ను చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది : హరీష్ రావు

05 December 2024, 16:43 IST

google News
    • Harish Rao vs Revanth Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్‌గా హరీష్ రావు, కేటీఆర్ పంచ్ డైలాగ్‌లు పేలుస్తున్నారు. అటు రేవంత్ తగ్గడం లేదు. తనదైన స్టైల్‌లో కౌంటర్లు ఇస్తున్నారు.
హరీష్ రావు
హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని ఆహ్వానించారు. సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో విమర్శలు గుప్పించారు. అయితే.. రేవంత్ చేసిన కామెంట్స్‌పై మాజీమంత్రి హరీష్ రావు తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు.

'ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏడాది కాకుండానే డబ్బు సంచులతో కూల్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి.. నేడు ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు చెబుతున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణమిది. ఊసరవెల్లి కూడా రేవంతును చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది' అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

అరెస్టులపైనా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. 'ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు.. పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టుల.. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు.. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు.. ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు.. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు.. ప్రజలపై కేసులు, ప్రజాప్రతినిధులపై కేసులు, కేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు - కేసులు మాకు, సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం. తక్షణం విడుదల చెయ్యాలి. జాగో తెలంగాణ జాగో' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం