KCR Re Entry : త్వరలో బీఆర్ఎస్ 2.0.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి కేసీఆర్ సిద్ధం!
07 November 2024, 12:22 IST
- KCR Re Entry : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది దగ్గరకు వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే.. కొత్త సర్కారుకు ఓ ఏడాది టైమ్ ఇద్దాం.. ఆ తర్వాత ప్రభుత్వ పనితీరుపై స్పందిద్దాం అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏడాది కావడంతో.. కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు.
కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్‌గా లేక చాలా రోజులు అయ్యింది. ఇటీవల తెలంగాణలో ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటారని చాలామంది కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో.. అతి త్వరలోనే కేసీఆర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తారని బీఆర్ఎస్ పార్టీలో టాక్ నడుస్తోంది.
రంగంలోకి గులాబీ బాస్..
2025 జనవరి నుంచి గులాబీ బాస్ రంగంలోకి దిగుతారని.. బీఆర్ఎస్ కీలక నేత ఒకరు చెప్పారు. కొత్త సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి కేసీఆర్ సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. జనవరి నుంచి బీఆర్ఎస్ 2.0 ను తెలంగాణ ప్రజలు చూస్తారని కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న నాయకుడు వివరించారు. ప్రభుత్వంపై కొట్లాడడానికే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు.
కొత్త కమిటీలు..
కొత్త సంవత్సరం నుంచి కొత్త కమిటీలు వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచి.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ రెస్ట్..
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఉనికిని చాటుకోలేకపోయింది. అప్పటి నుంచి ఒకట్రెండు సందర్భాలు మినహా.. కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకుంటారు.. పార్టీని కేటీఆర్, హారీశ్ రావు నడిపిస్తారనే కామెంట్స్ వినిపించాయి.
జిల్లాల నేతలతో సమావేశం..
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీని వీడుతున్న లీడర్ల గురించి చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ప్రజల్లో అసహనం..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇంకాస్త పెరిగాక.. సరైన ఇష్యూపై ఘాటుగా స్పందించాలని కేసీఆర్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అదే కాకుండా.. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. అప్పుడే విమర్శలు, ఆరోపణలు చేస్తే.. బాగుండదనే అభిప్రాయంలో కారు పార్టీ చీఫ్ ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ హామీల అమలు, ఇతర వైఫల్యాలపై ప్రశ్నిస్తూ.. ఓ భారీ కార్యక్రమం ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్‌కు సమాచారం..
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నా.. కేసీఆర్‌కు సమాచారం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పదేళ్లు ప్రభుత్వ చీఫ్‌గా ఉన్న కేసీఆర్‌కు కొందరు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే.. ప్రస్తుత ఇంటలిజెన్స్ అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. సీఎం పేషీ, సెక్యూరిటీ, ఇతర కీలక బాధ్యతల్లో గతంలో కేసీఆర్‌కు దగ్గరగా పనిచేసిన వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. దీంతో చాలామంది అధికారులను మార్చారు.