తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్, 24 మంది విద్యార్థులకు అస్వస్థత - ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

Sangareddy District : ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్, 24 మంది విద్యార్థులకు అస్వస్థత - ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

HT Telugu Desk HT Telugu

14 August 2024, 16:30 IST

google News
    • సంగారెడ్డి జిల్లా బీబీపేట పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు… పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. పాడైన కోడి గుడ్లను పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక నిర్ధరించారు.
బీబీపేట పాఠశాలలో ఫుడ్  పాయిజన్
బీబీపేట పాఠశాలలో ఫుడ్ పాయిజన్

బీబీపేట పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో సిబ్బంది ఉడికించిన కోడిగుడ్డును అందజేశారు.

భోజనం తిన్న కొద్దిసేపటికి విద్యార్థులకు విరేచనాలు వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి…చికిత్స అందించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాఠశాల హెచ్ఎం ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు .

పాడైన గుడ్లను పెట్టడంతోనే

సంగారెడ్డి జిల్లా బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో 114 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 94 మంది విద్యార్థులు సోమవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం చేసిన గంట తర్వాత కొంతమంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడగా, మరికొంత మంది విద్యార్థులు విరేచనాలు, వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన 24 మంది విద్యార్థులను 108 వాహనంలో నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి,చికిత్స అందించారు. 

అక్కడ పరీక్షించిన వైద్యులు… పిల్లలకు నాసిరకం భోజనంతో పాటు పాడైన గుడ్లను పరిశీలించకుండా ఉడికించి పెట్టడం వలన ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్నీ ఉపాద్యాయులు వారి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వలేదన్నారు. గ్రామానికి చెందిన వ్యక్తుల ద్వారా తెలుసుకొని ఆసుపత్రికి వచ్చామని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు అధికారులను కోరారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి వారిని పరామర్శించారు. వారి తల్లితండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓ శంకర్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి సమాచారం సేకరించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.

ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్........

ఎంఈఓ శంకర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై డీఈఓ మాట్లాడుతూ .. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. మధ్యాహ్న భోజనంలో పాడైన గుడ్లను పరిశీలించకుండా ఉడికించడం, వాటిని విద్యార్థులకు వడ్డించడంలో ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కారణంతో హెచ్ఎంను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ప్రకటించారు. అదే పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ రాములుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులను కూడా తొలగించామని ఎంఈఓ శంకర్ తెలిపారు. పాఠశాలలో సిబ్బంది వంటలు పూర్తి చేయగానే ఉపాద్యాయులు, కమిటీ పరిశీలించాక విద్యార్థులకు భోజనాలు పెట్టాలని ఆదేశించారు.

తదుపరి వ్యాసం