Telangana Congress Six Guarantees : కాంగ్రెస్ ఏడాది పాలన...! 6 గ్యారెంటీల అమలు ఎక్కడి వరకు వచ్చింది..?
05 December 2024, 17:52 IST
- Congress Six Guarantees in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ సర్కార్ కు 365 రోజులు పూర్తవుతాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడి వరకు వచ్చింది..? ఎన్ని హామీలు పట్టాలెక్కాయనే దానిపై ఓ లుక్కేద్దాం…..
తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
తెలంగాణలో తొలిసారిగా అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కావొస్తోంది. గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. 9వ తేదీన కాంగ్రెస్ సర్కార్ పీఠమెక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారెంటీలను ప్రస్తావించింది. కాంగ్రెస్ ప్రకటించిన 'సిక్సర్' వర్కౌట్ కావటంతో… తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు… సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. పథకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో… ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలవుతున్నాయి..? అమలు కావాల్సినవి ఏం ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం….
కాంగ్రెస్ 6 గ్యారెంటీలు :
1. మహాలక్ష్మి:
-ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.
-రూ.500లకే గ్యాస్ సిలిండర్.
-రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం.
మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు చూపించి… ఉచితంగా జర్నీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.
2. రైతు భరోసా
-ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం.
-ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం.
-వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన.
వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తామని ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి పంటకు(సన్నాలు) రూ. 500 బోనస్ అమలు చేస్తున్నారు.
3. గృహజ్యోతి
-ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం.
ఈ స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలెక్కించింది. మార్చి 1వ తేదీన ఈ స్కీమ్ ప్రారంభమైంది. 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు వాడుతున్న వారికి జీరో బిల్లులను ఇస్తున్నారు.
4. ఇందిరమ్మ ఇళ్లు
-ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం.
-తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రారంభించారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం సర్కార్ లోతుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం(డిసెంబర్ 05, 2024) ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పథకం అమలు కావాల్సి ఉంది.
5. యువ వికాసం
-విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు.
-ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు.
విద్యా భరోసా కార్డు అమలు కావాల్సి ఉంది. దీనిపై సర్కార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
6. చేయూత
-పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను.
-ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం.
గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లే ప్రస్తుతం అమలవుతున్నాయి. పెంపు అమలుపై ఎలాంటి ప్రకటన లేదు. ఇక ఆరోగ్య శ్రీ కింద ఉన్న రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచారు.