Coal Block Auctions : సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి - వామపక్షాల నిరసనలు
05 July 2024, 20:42 IST
- Singareni Coal Block Auctions : సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా శుక్రవారం కలెక్టర్ల ఎదుట ధర్నాలు చేపట్టారు.
బొగ్గు బ్లాక్ ల వేలం రద్దు కోసం కామ్రేడ్ల ఆందోళనలు
సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసించారు. వేలాన్ని వెంటనే రద్దు చేసి, బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్శివర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వాసుదేవరెడ్డి, మర్రి వెంకటస్వామి పాల్గొని ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తెలంగాణకు తలమానికమైన బొగ్గు బ్లాక్ లను వేలం వేయడం అంటే తెలంగాణ తలను నరికేసి మొండాన్ని మిగిల్చడమేనని తెలిపారు.
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ రామగుండంలో పర్యటించిన సందర్భంలో సింగరేణి ని వేలం వేయమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ సంపదను కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సంపదను దోచుకోవడానికే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల మంత్రి పదవి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల మద్దతుతో సర్కార్ ను ఏర్పాటు చేసిన కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి….
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వినతి పత్రాలకు పరిమితం కాకుండా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష పార్టీలను ఆహ్వానించి పోరాటానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేలంపాటలో స్వయంగా పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏంటనీ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదాని, నాడు వీర తెలంగాణ సాయుధ పోరాటం, నిన్న ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసి అధికారుల మెడలు వంచిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందని గుర్తు చేశారు. బొగ్గు గనుల వేలాన్ని ఆపకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఎంపీలను తిరగనివ్వం…
తెలంగాణలోని ఎంపీలు పార్లమెంట్ లో బొగ్గు బ్లాక్ ల రద్దు చేయాలని పోరాడాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. వామపక్ష పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్ లను, ఇతర పార్టీలను కలుపుకొని లోపల పార్లమెంటులో, బయట ప్రత్యక్ష ఆందోళన, పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు.
ప్రస్తుత ధర్నాలు ఆరంభం మాత్రమేనని మున్ముందు మరింత ఉధృతంగా పోరాడుతామని హెచ్చరించారు. మంద బలం ఉందని పార్లమెంటులో చట్టాలు చేస్తే ప్రజలు ఆహ్వానించరని, ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంతో నరేంద్రమోడీ మెడలు వంచి నల్లచట్టాలను రద్దు చేసుకున్న ఘటన చూశామన్నారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో బొగ్గు బ్లాక్ ల వేలాన్ని రద్దు చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అత్యధికంగా లాభాలతో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్ ను తొక్కి పెట్టారని వామపక్ష నేతలు విమర్శించారు. జియో రూపంలో అనిల్ అంబానీ జేబులు నింపారని, అదే విధంగా సింగరేణి ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
బొగ్గు గనులను వేలం వేస్తే వేలాదిమంది సింగరేణి కార్మికుల ఆగం అవుతారని, తెలంగాణ ఆర్థిక సంపదను అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొని తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నరేంద్ర మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.