TG Rythu Bharosa : రైతుభరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు : సీఎం రేవంత్
21 December 2024, 15:08 IST
- TG Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఈ పథకాన్ని నిలిపేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
సీఎం రేవంత్
రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా అంశంపై శాసనసభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షం సలహాలు తీసుకుని విధివిధానాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. రైతు భరోసా.. రైతులను ఆదుకునేందుకేనని.. రైతుభరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు.
అదే మా ఆలోచన..
'రైతులను ఆదుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది. భూమినే నమ్ముకుని, భూమిని అమ్మగా భావించిన రైతులను ఆదుకోవాలనేదే మా ఆలోచన. రైతు బంధు ఉద్దేశం పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం ఎవరికి ఉండాలి? గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేసింది. సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, నేషనల్ హైవేస్‌కు కూడా రైతు బంధు ఇచ్చారు. రూ.72,817 కోట్లలో దాదాపు రూ.22వేల కోట్లు అనర్హులకు ఆయాచిత లబ్ది చేకూర్చారు' అని సీఎం వివరించారు.
రాళ్లకు.. గుట్టలకు ఇద్దామా..
'ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా? గతంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారి కూడా రైతు బంధు ఇచ్చారు. ఆమన్ గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు కూడా ఇచ్చారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. వాళ్ల అనుయాయులు కొందరు నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పొందారు. హైదరాబాద్ చుట్టుపక్కల 50కి.మీ పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం చేయడం లేదు. కానీ గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల 3 కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు..
'రైతు బంధు రూపంలో వేలాది కోట్ల కొల్లగొట్టారు. 80 వేల పుస్తకాలు చదివిన మేథస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారని మేం భావించాం. చివరి పేద వాడికి కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. వాళ్లు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని అందరికీ ఇవ్వాలంటున్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే వాళ్లలాగే మేం ఇక్కడ ఉండం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రైతులే ఆదర్శం..
'మాకు రైతులు ఆదర్శం.. రైతు సంక్షేమమే మాకు ముఖ్యం. సభలోకి వస్తే సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదేమో. రాళ్లు రప్పలు, గుట్టలు, రియల్ లే అవుట్లకు, నేషనల్ హైవేలకు రైతు భరోసా ఇద్దామా? ప్రతిపక్షంగా ఒక స్పష్టమైన సూచన ఇవ్వండి. మీ సూచనలు సహేతుకమైతే మేం వినడానికి సిద్ధంగా ఉన్నాం' అని రేవంత్ స్పష్టం చేశారు.
రెండో స్థానంలో తెలంగాణ..
'2019లో నేను పార్లమెంటులో రైతు ఆత్మహత్యలపై అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం ఇచ్చారు. 2014, 2015, 2016 కు సంబంధించి రైతు ఆత్మహత్యలపై సభలో సమాధానం ఇచ్చారు. ఏపీలో 2014లో 160, 2015లో 516, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 2014లో 2568, 2015లో 3030, 2016లో 2550 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల ఏలుబడిలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 2014లో 898, 2015లో 1358, 2016లో 632 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సిగ్గుచేటు..
'మనకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు జరగలేదు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటు. వాళ్లు తల దించుకుని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఏడాదిలో మేం ఏం చేశామని ఇన్నిసార్లు అడుగుతున్నారు.. పదేళ్లలో మీ హయాంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోండి. ఐదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీకి వాళ్లు ఖర్చు చేసింది రూ.16,143 కోట్లు. అది కేవలం మిత్తికే సరిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక వీళ్లు చేసిన రుణమాఫీ రూ.11, 909 కోట్ల 31 లక్షలు మాత్రమే' అని ముఖ్యమంత్రి వివరించారు.
పదేళ్లలో ఏం చేశారు..
'మీరు చేసిన రుణమాఫీ కేవలం రూ.3384 కోట్లు మాత్రమే... ఇదీ మీ చరిత్ర. పదేళ్లలో వారు చేసిన రుణమాఫీ రూ.27వేల కోట్లు. 27 రోజుల్లో దేశంలో ఎక్కడా లేని విదంగా మొదటి ఏడాదిలోనే 25,35,963 రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి మా ప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుంది. ఇది మా గొప్పతనంగా మేం అనుకోవడంలేదు. ఇది మా బాధ్యతగా భావిస్తున్నాం. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ. సోనియా దగ్గరికి వెళ్లి బొక్కబోర్ల పడిన సంగతి మరిచిపోయారు. కృతజ్ఞత లేని మనుషులు వాళ్లు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.