Telangana Assembly : కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
05 December 2024, 13:19 IST
- Telangana Assembly : మరో నాలుగు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అసెంబ్లీలో కేసీఆర్ (ఫైల్ ఫొటో)
రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో వీరి ఫైట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సభ ఏదైనా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తారు. అయితే.. తాజాగా సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ ఏమన్నారంటే..
'కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. మీ సలహాలు, సూచనలతో సభను నడపండి. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదు. పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలి. కేసీఆర్ కంటే మేం జూనియర్ శాసనసభ్యులమే. కేసీఆర్ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు. మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదు. రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా. ఈ నెల 9న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలి. మంత్రి పొన్నం వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సమావేశాలకు ప్రాధాన్యత..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
కేసీఆర్ ఒక్కసారే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ ప్లాన్..
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి ప్లాన్‌తో ఉంది. గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.